Reading Time: < 1 minute

ఖమ్మం జిల్లా వైరా ఏరియా వాళ్లకు ఈ ముచ్చట తెలుసో.. లేదో..!

Caption of Image.

వైరా: ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం గ్రామ సమీపంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేపై అధికారికంగా వాహనాలకు అనుమతి ఇచ్చారు. సోమవారం గ్రామ సమీపంలోని ఎగ్జిట్ పాయింట్ దగ్గర నుంచి నేషనల్ హైవే అథారిటీ అధికారులు టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. టోల్ ఫీజు కార్యాలయాన్ని ప్రాజెక్ట్ మేనేజర్ దివ్య అధికారికంగా ప్రారంభించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలను టోల్ గేట్  సిబ్బంది అనుమతించకపోవడం గమనార్హం.

ఖమ్మం, దేవరపల్లి గ్రీన్​ ఫీల్డ్ హైవేపై రాకపోకలకు జనవరి 2026లో బ్రేక్​పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ దృష్ట్యా హైదరాబాద్​నుంచి ఏపీకి వెళ్లేందుకు జనవరిలో తాత్కాలికంగా ఈ హైవేపై వాహనాలను అనుమతించారు. వందనం నుంచి దాదాపు 120 కిలోమీటర్ల మేర వాహనాలు ప్రయాణించేందుకు ఎంట్రీ, ఎగ్జిట్లను ఓపెన్​ చేశారు. దీంతో పండుగకు ముందు ఏపీకి వెళ్లిన వారు, ఆ తర్వాత ఏపీ నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్లేందుకు కూడా ఈ గ్రీన్​ ఫీల్డ్ హైవేనే ఉపయోగించుకున్నారు.

కానీ వరుస ప్రమాదాలతో ఆఫీసర్లు ఈ హైవేపై రాకపోకలను నిలిపివేశారు. నిర్మాణ పనుల కోసం సామగ్రి వాహనాలను తప్పించి, ఇతర వెహికల్స్ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. హైవేపై ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను బారికేడ్లతో మూసివేశారు. వాహనదారులు వాటిని ఈజీగా తొలగించకుండా ఉండేందుకు క్రాష్​ బ్యారియర్స్ను కూడా పెట్టారు. పెండింగ్ పనులన్నీ పూర్తి కావడంతో ఏప్రిల్ 20, 2026న అధికారికంగా రాకపోకలకు అనుమతించారు. ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే మొత్తం 162 కిలోమీటర్లు ఉంది.

ఈ గ్రీన్​ ఫీల్డ్లో మొత్తం 11 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రధాన రహదారులు, పెద్ద గ్రామాలు, పట్టణాలు ఉన్న చోట్ల 8 ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేపై టూవీలర్లకు అనుమతి లేదు. యాక్సెస్​ కంట్రోల్డ్ హైవే కావడం వల్ల కార్లు, ఇతర ఫోర్​ వీలర్లు, పెద్ద వాహనాలకే అనుమతి ఉంటుంది. టూవీలర్లు, ఆటోలు, ట్రాక్టర్లను కూడా అనుమతించరు.

©️ VIL Media Pvt Ltd.