Reading Time: 2 minutes

కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు వృథా..కమీషన్లతో కేసీఆర్‌‌ ఫ్యామిలీ వందల ఎకరాల్లో ఫామ్ హౌస్‌లు కట్టుకుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి

Caption of Image.
  • కాంగ్రెస్ పాలనకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నయ్‌
  • సిద్దిపేట బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపు 

సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్లు వృథా చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. పేదలకు మాత్రం డబుల్ బెడ్రూమ్‌ ఇండ్లు కట్టివ్వలేదని సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. ప్రాజెక్టుల కమీషన్లతో కేసీఆర్ కుటుంబం వందల ఎకరాల్లో ఫామ్ హౌస్‌లు కట్టుకుందన్నారు. ఆదివారం సిద్దిపేట ఆరో వార్డులో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని, దాని మీద నెలకు రూ.5 వేల కోట్లు వడ్డీని కాంగ్రెస్‌ ప్రభుత్వం కడుతున్నదని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, అర్హులైన పేదలకు తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. త్వరలో 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

కాంగ్రెస్ పాలనలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, వారి పేరు మీదే ఇందిరమ్మ ఇండ్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. మహిళలకు బ్యాంకు లింకేజీతో వడ్డీ లేని రూ.23 వేల కోట్ల రుణాలను అందించామన్నారు. మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు.

సిద్దిపేట బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి పార్టీ శ్రేణులు ఐక్యంగా పని చేయాలని, పార్టీ నేతలు కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

పట్టణంలోని ఏ సమస్య ఉన్న తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. సిద్దిపేటలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ప్రత్యేక నిధులు తెస్తానని, త్వరలో సీఎంను కలసి నిధులు కోరతానన్నారు. సిద్దిపేటలోని 43 వార్డుల్లో పార్టీ ఆఫీసులు ప్రారంభించాలని, గ్రూపులకు అతీతంగా ఐక్యంగా పనిచేస్తే విజయం సులభమవుతుందని చెప్పారు.

పట్టణంలోని 8వ వార్డు బీఆర్ఎస్ నేత నాగరాజు నాయకత్వంలో 50 మంది, నంగునూరు మండలానికి చెందిన మరో 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి వివేక్ వెంకటస్వామి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, సాకి ఆనంద్, ఎల్లం యాదవ్, చిన్నకోడూరు ఏఎంసీ చైర్మన్ మహేందర్ యాదవ్​, నంగునూరు ఏఎంసీ చైర్మన్ దేవుల పల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మికులతో సమావేశం..

సిద్దిపేట భవన నిర్మాణ రంగ కార్మికులతో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లప్పుడు కార్మికుల గురించే ఆలోచించాలని మా నాన్న కాకా వెంకటస్వామి చెప్పేవారన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, హమాలీల కోసం చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. కార్మికులకు న్యాయం చేయడం కోసమే ఈ శాఖ తీసుకున్నట్టు తెలిపారు.

సిద్దిపేటలో భవన నిర్మాణ కార్మికులకు భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. తాము బీఆర్ఎస్ పార్టీలాగా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వలేమన్నారు. తమకు లేబర్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు కావాలని కార్మికులు కోరగా అర్హత ఉన్నవారికి ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

©️ VIL Media Pvt Ltd.