Reading Time: 2 minutes

నిర్మల్.. అప్పులు నిల్ !.. మహిళా సంఘాల రుణాల చెల్లింపులో రికార్డు

Caption of Image.
  • రాష్ట్రంలోనే తొలి ‘జీరో ఎన్‌‌‌‌పీఏ’ జిల్లాగా గుర్తింపు
  • శాస్త్రీయ ప్రణాళిక, ఉపాధి హామీ అనుసంధానంతో సత్ఫలితాలు
  • జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు : మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపులో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ నెల 10 నాటికి జిల్లా అధికారికంగా ‘జీరో ఎన్‌‌‌‌పీఏ’ (నిరర్ధక ఆస్తి లేదా మొండి బకాయిలు) గుర్తింపు సాధించి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. నిర్మల్‌‌‌‌ జిల్లాలో 74 అకౌంట్స్‌‌‌‌ ఉండగా.. రూ.80.61 లక్షల రుణాలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. క్రమక్రమంగా వాటిని తగ్గిస్తూ జీరో ఎన్‌‌‌‌పీఏకు తీసుకొచ్చారు. ఒకప్పుడు బకాయిలతో సతమతమైన సంఘాలు.. నేడు వంద శాతం చెల్లింపులతో బ్యాంకర్ల మన్ననలు పొందుతున్నాయి. 

మూడు గ్రూపులుగా విభజన

నిర్మల్‌‌‌‌ జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌‌‌‌లో ఉన్న రుణాల సమస్యను పరిష్కరించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్​డీఓ) విజయలక్ష్మి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించారు. 15 రోజులకు ఒకసారి వీఓఏలతో క్లస్టర్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లతో పాటు రికవరీ  కోసం సబ్‌‌‌‌ కమిటీలు ఏర్పాటు చేశారు. మరో వైపు నోటీసులతోనే సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించారు. ఇందులో భాగంగా రుణాలు తీసుకున్న గ్రూపులను మూడు కేటగిరీలుగా విభజించారు. డబ్బులు ఉండి కట్టని గ్రూపులు, డబ్బులు లేక కట్టలేని గ్రూపులు, పని కల్పిస్తే రుణాలు చెల్లించే గ్రూపులుగా గుర్తించారు. అలాగే విలేజ్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌ అసిస్టెంట్ల (వీఓఏ) పనితీరుపై నిఘా పెట్టి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నారు. 

మహిళల ఆదాయం పెంపుపై దృష్టి

బకాయిలు ఉన్న మహిళలపై ఆఫీసర్లు ఒత్తిడి చేయకుండా వారి పరిస్థితిని తెలుసుకుని ఆదాయ మార్గాలను మెరుగుపరిచారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారికి ఉపాధి హామీ పని కల్పించడంతో పాటు అప్పుల చెల్లించేలా చొరవ తీసుకున్నారు. మహిళలకు ఉపాధి పనులు కల్పించడం ద్వారా వారికి డబ్బు అందడంతో బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు కట్టడం మొదలు పెట్టారు. దీనికితోడు  ప్రతి బుధవారం ‘మిషన్ రేలా’ పేరుతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రుణాలు చెల్లింపుపై అవగాహన కల్పించారు. క్రమంగా రుణాలు చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనాలపై మహిళా సంఘాలను చైతన్యం చేశారు. ఆయా గ్రామాల్లో పాంపాండ్స్‌‌‌‌, ఓపెన్‌‌‌‌ వెల్స్, రోడ్లు వంటి పనుల ద్వారా మహిళలకు ఆదాయం కల్పించడమే కాకుండా గ్రామీణ ఆస్తులను సృష్టించారు. 

బైంసా మండలంలోని గుండెగాంలో మహిళా సంఘాలకు రూ. 25 లక్షల రుణం ఉండేది. అధికారుల సూచనతో ఉపాధి పనులకు వెళ్లిన మహిళలు రోజుకు రూ.307 వేతనం తీసుకుంటూ ఏడాదిలో రూ.19 లక్షలు చెల్లించారు. కుబీర్​ మండలంలోని దయానిమాగ గ్రామంలో మహిళా సంఘాలకు రూ.20 లక్షల బకాయిలు ఉండగా… పాంపాండ్స్‌‌‌‌, బావుల నిర్మాణంతో ఆదాయం మార్గం చూపించారు. దీంతో వారు ఉపాధి పనుల్లో వచ్చిన ఆదాయంతో అప్పు తీర్చేశారు. కల్వర్టులు, సీసీ రోడ్ల నిర్మాణంలో మహిళలను భాగస్వామ్యం చేయడం ద్వారా చాలా గ్రామాల్లో రూ.20 లక్షల వరకు పాత బకాయిలు క్లియర్‌‌‌‌ చేసినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.  

రాష్ట్రమంతా ఇదే ప్రణాళిక అమలు చేస్తాం 

నిర్మల్‌‌‌‌ జిల్లాలో అమలు చేసిన ప్రణాళికను రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ పైలట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌గా చేపడుతాం. ప్లానింగ్, ఫీల్డ్ లెవల్ ఇంప్లిమెంటేషన్‌‌‌‌ సక్రమంగా ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. క్షేత్రస్థాయి కృషి, మహిళలపై ఉంచిన నమ్మకమే ఈ విజయానికి మూలం. నిర్మల్‌‌‌‌ జిల్లాలో జీరో ఎన్‌‌‌‌పీఏ సాధించడం హర్షణీయం– దివ్య దేవరాజన్‌‌‌‌, సెర్ప్ సీఈఓమహిళల ఆదాయ వనరులు పెంచాం మహిళలను ఒత్తిడికి గురి చేయకుండా వారి పరిస్థితులను అర్థం చేసుకుని ఆదాయం పెంచేలా చర్యలు తీసుకున్నాం. ఇది కేవలం రుణాల క్లియరెన్స్ కాదు, మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచిన ఉద్యమం. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. బ్యాంకులు సైతం ఇప్పుడు కొత్త రుణాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి.– విజయలక్ష్మి, డీఆర్డీఓ, నిర్మల్‌‌‌‌ జిల్లా

©️ VIL Media Pvt Ltd.