
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ రింగ్ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ పనులు మళ్లీ ప్రారంభం కానుండడంతో ట్రాఫిక్ డైవర్షన్‌కు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సోమవారం నుంచి ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఘట్‌కేసర్ వైపు నుంచి వచ్చే వాహనాలను మెహిఫిల్ హోటల్ సమీపంలోని ఉప్పల్ భగాయత్ లేఅవుట్ నుంచి నాగోల్ యూటర్న్ మీదుగా నగరంలోకి ప్రవేశించేలా డైవర్షన్ ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే తార్నాక, రామంతాపూర్ వైపు నుంచి ఘట్‌కేసర్ దిశగా వెళ్లే వాహనాలను ఉప్పల్ భగాయత్ మార్గం ద్వారా మళ్లించేలా ట్రయల్ రన్‌కు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ట్రయల్ రన్ ద్వారా ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించి అవసరమైన మార్పులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.