
జగిత్యాల, వెలుగు : ‘పదేండ్ల పాటు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు, ప్రజలు గుణపాఠం చెప్పినా వారి తీరు మారడం లేదు’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ విమర్శించారు. ఆదివారం జగిత్యాలలోని పార్టీ ఆఫీస్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సభ నిర్వహించే సభ ప్రాంగణ సామర్థ్యం 15 వేలకు మించదని, దీనికే భారీ సభ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కొండగట్టులో 60 మంది చనిపోతే రాని కేసీఆర్… ఈ సభ కోసం హెలికాప్టర్‌లో వస్తారా అని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టారన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయన్నారు. పార్టీ ఫిరాయింపులకు కేసీఆరే పితామహుడని విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ… గతంలో కేసీఆర్, కవితను విమర్శించిన జీవన్‌రెడ్డి.. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఎలా ఆప్తుడు అయ్యారని ప్రశ్నించారు. జగిత్యాల అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ పాల్గొన్నారు.