
- మేం ఎవరిపైనా దాడి చేయట్లే.. మమ్మల్ని మేం రక్షించుకుంటున్నం
- హార్మూజ్ గుండా మేమే వెళ్లలేనప్పుడు ఇతరులను ఎలా వెళ్లనిస్తం?: ఘాలిబాఫ్
- అమెరికాతో తుది చర్చలకు చాలా దూరంలో ఉన్నామని వెల్లడి
టెహ్రాన్: తమ అణు హక్కులను హరించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. ‘ఇరాన్ తన అణు హక్కులను ఉపయోగించుకోకూడదని ట్రంప్ అంటున్నారు. కానీ ఏ నేరం చేశామో చెప్పడం లేదు. ఒక దేశ హక్కులను హరించడానికి ఆయన ఎవరు?’ అని పెజెష్కియాన్ అన్నట్లు ఆదివారం ‘ఇస్నా’ వార్తా సంస్థ ఓ కథనంలో వెల్లడించింది. ‘మేం ఏ దేశంపై దాడి చేయలేదు. ప్రస్తుత పరిస్థితిలో ఎవరిపైనా దాడి చేసే ఉద్దేశమూ లేదు. మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసం మాత్రమే చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆయన స్పష్టం చేశారు. పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆ రెండు దేశాలపై ఆయన ఫైర్ అయ్యారు. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని, మానవ హక్కుల విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శించారు. ‘ఇరాన్ యుద్ధాన్ని కోరుకుంటోందని చెప్పకూడదు. మేం శాంతిని ప్రేమిస్తాం. మేం చేస్తున్నది చట్టబద్ధమైన ఆత్మరక్షణ. ప్రతి మనిషి దురాక్రమణపై ఎలా స్పందిస్తాడో, అలాగే ఒక దేశం కూడా దాడికి వ్యతిరేకంగా తనను తాను రక్షించుకుంటుంది’ అని పెజెష్కియాన్ పేర్కొన్నారు.
మేం వెళ్లలేనప్పుడు, ఇతరులూ వెళ్లలేరు..
ఇరాన్ రేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగినంత కాలం హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. ‘మేం హార్మూజ్ జలసంధి నుంచి వెళ్లలేనప్పుడు ఇతరులను ఎలా వెళ్లనిస్తం?’ అని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అమెరికాతో జరుగుతున్న చర్చల్లో ఇరాన్ ప్రధాన ప్రతినిధిగా ఉన్న ఘాలిబాఫ్.. అమెరికా దిగ్బంధనాన్ని ‘అజ్ఞానంతో తీసుకున్న అమాయకపు నిర్ణయం’ అని విమర్శించారు. అమెరికాపై తీవ్ర అపనమ్మకం ఉన్నప్పటికీ ఇరాన్ ఇంకా శాంతిని కోరుకుంటోందని చెప్పారు.
అయితే, అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చల్లో ‘పురోగతి’ ఉందని, తుది చర్చలకు మాత్రం ఇంకా చాలా దూరంలో ఉన్నామన్నారు. ‘చాలా అంతరాలు ఉన్నాయి. కొన్ని ప్రాథమిక అంశాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది’ అని చెప్పారు. ‘మేం కాల్పుల విరమణను అంగీకరించామంటే, దానికి కారణం వారు మా డిమాండ్లను అంగీకరించడమే’ అని ఆయన అన్నారు.
అమెరికా తన లక్ష్యాలను సాధించలేకపోయిందని, వ్యూహాత్మక సముద్ర రవాణా మార్గమైన హార్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉందని ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. కాగా, హార్మూజ్ ను దిగ్బంధించడం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. జలసంధిని ‘షరతులతో కూడిన లేదా పరిమితంగా తెరవడాన్ని’ అడ్డుకుని తీరతామని స్పష్టం చేసింది.