
- 4 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గెలుపు
- పోరాడిన రింకూ, అనుకూల్ రాయ్
- రాణించిన చక్రవర్తి, నరైన్
కోల్‌కతా: భారీ హిట్టర్లు ఉన్నా.. నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నా.. విజయాలు లేక తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు ఐపీఎల్–19లో బోణీ చేసింది. ఐదు పరాజయాల తర్వాత తొలి గెలుపును అందుకుంది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో రింకూ సింగ్ (34 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) పట్టు వదలకుండా చేసిన పోరాటానికి అనుకూల్ రాయ్ (16 బాల్స్‌లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 29 నాటౌట్) అండగా నిలవడంతో.. ఆదివారం చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన లీగ్ మ్యాచ్‌లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై నెగ్గింది. టాస్ నెగ్గిన రాజస్తాన్ 20 ఓవర్లలో 155/9 స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ (28 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), యశస్వి జైస్వాల్ (29 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. తర్వాత కోల్‌కతా 19.4 ఓవర్లలో 161/6 స్కోరు చేసింది. వరుణ్ చక్రవర్తి (3/14)కి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్పిన్నర్ల జోరు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ను కేకేఆర్ స్పిన్నర్లు కార్తీక్ త్యాగీ (3/22), చక్రవర్తి, సునీల్ నరైన్ (2/26) అద్భుతంగా కట్టడి చేశారు. ఆరంభంలో పేసర్లు విఫలం కావడంతో రాయల్స్ ఓపెనర్లు జైస్వాల్, సూర్యవంశీ ధాటిగా ఆడారు. వైభవ్ అరోరా, కామెరూన్ గ్రీన్‌ను టార్గెట్‌గా చేసుకుని ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఫలితంగా పవర్‌ప్లేలో 63/0తో రాయల్స్ మంచి స్థితిలో కనిపించింది. ఏడో ఓవర్‌లో స్పిన్నర్ల రాకతో మ్యాచ్ మలుపు తిరిగింది. అప్పటి వరకు దీటుగా ఆడిన వైభవ్‌ను 9వ ఓవర్‌లో వరుణ్ ఔట్ చేశాడు. ఫలితంగా తన కెరీర్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తొలి వికెట్‌కు 81 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. యశస్వి సిక్స్‌తో ఫస్ట్ టెన్‌లో రాయల్స్ 95/1తో నిలిచింది. తర్వాతి రెండు ఓవర్లలో వరుణ్, నరైన్ వరుసగా ధ్రువ్ జురెల్ (5), జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపారు. ఇక్కడి నుంచి మరింత పట్టు బిగించిన కేకేఆర్ బౌలర్లు వరుస విరామాల్లో రియాన్ పరాగ్ (12), డొనొవాన్ ఫెరీరా (7)ను ఔట్ చేయగా, 19వ ఓవర్‌లో త్యాగీ ఐదు బాల్స్ తేడాలో జడేజా (9), హెట్‌మయర్ (15), రవి బిష్ణోయ్ (0) వికెట్లు పడగొట్టాడు. చివరి 10 ఓవర్లలో 60 రన్సే రావడంతో రాయల్స్ భారీ టార్గెట్ నిర్దేశించలేదు.
టాప్ ఫెయిలైనా..
చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి కూడా అపసోపాలు పడిన కోల్‌కతాకు చివర్లో రింకూ సింగ్ విజయాన్ని అందించాడు. ఇన్నింగ్స్ తొలి బాల్‌కే టిమ్ సిఫర్ట్ (0)ను ఆర్చర్ (1/35), రెండో ఓవర్‌లో కెప్టెన్ రహానె (0)ను బర్గర్ (1/20) డకౌట్ చేశారు. దాంతో 5/2తో ఎదురీత మొదలుపెట్టిన కేకేఆర్ ఇన్నింగ్స్‌ను అంగ్‌క్రిష్ రఘువంశీ (10), కామెరూన్ గ్రీన్ (17) ఆదుకునే ప్రయత్నం చేశారు. అయినా రాయల్స్ బౌలింగ్ ముందు వీళ్లిద్దరూ తేలిపోయారు. ఐదో ఓవర్‌లో రవి బిష్ణోయ్ (1/41).. గ్రీన్‌ను ఔట్ చేశాడు. ఫలితంగా కేకేఆర్ 51/3తో పవర్‌ప్లేను ముగించింది. చాలా పొదుపుగా బౌలింగ్ చేసిన జడేజా (2/8) ఏడో ఓవర్‌లో రఘువంశీని బోల్తా కొట్టించాడు. స్కోరు 52/4గా మారింది. ఈ దశలో పావెల్ (23), రింకూ వికెట్లను కాపాడుకుంటూ ముందుకెళ్లారు. దాంతో ఫస్ట్ టెన్‌లో కేకేఆర్ 70/4తో నిలిచింది. కానీ 11వ ఓవర్‌లో పావెల్, 14వ ఓవర్‌లో రమన్‌దీప్ సింగ్ (10) వెనుదిరగడంతో నైట్‌రైడర్స్ 85/6తో కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి రింకూ ఒంటరిపోరాటం చేశాడు. రెండో ఎండ్‌లో అనుకూల్ రాయ్ అండగా నిలిచాడు. ఇద్దరూ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టారు. ఆర్చర్, బిష్ణోయ్‌ను లక్ష్యంగా చేసుకుని సిక్సర్లు కొట్టి రన్‌రేట్ పెరగకుండా చూసుకున్నారు. చివరి రెండు ఓవర్లలో 21 రన్స్ అవసరం కాగా, అనుకూల్ 6, రింకూ 4, 4తో విజయాన్ని అందించారు. ఈ క్రమంలో రింకూ 34 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్తాన్: 20 ఓవర్లలో 155/9 (సూర్యవంశీ 46, యశస్వి జైస్వాల్ 39, కార్తీక్ త్యాగీ 3/22, వరుణ్ చక్రవర్తి 3/14).
కోల్‌కతా: 19.4 ఓవర్లలో 161/6 (రింకూ సింగ్ 53*, అనుకూల్ రాయ్ 29*, జడేజా 2/8)