Reading Time: 2 minutes

మనుషుల కంటే వేగంగా రోబోల పరుగు: బీజింగ్ మారథాన్‌లో చైనా హ్యూమనాయిడ్ రోబోల సరికొత్త రికార్డు!

Caption of Image.

టెక్నాలజీలో చైనా మరో సంచలనం సృష్టించింది. బీజింగ్‌లో జరిగిన హాఫ్ మారథాన్‌లో మనుషులతో పోటీపడ్డ రోబోలు, మనుషుల కంటే వేగంగా పరుగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాయి. రోబోటిక్స్ చరిత్రలో ఇదొక అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయింది. బీజింగ్ ఇ-టౌన్ హ్యూమనాయిడ్ రోబోట్ హాఫ్-మారథాన్‌లో దాదాపు 100కు పైగా రోబోలు, 12,000 మంది మనుషులతో కలిసి 21.1 కిలోమీటర్ల దూరాన్ని పరుగెత్తాయి. భద్రత కోసం ప్రత్యేక అడ్డంకులు ఏర్పాటు చేసినప్పటికీ, రోబోలు వాటిని దాటుకుంటూ దూసుకుపోయాయి.

ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన ‘లైట్నింగ్’
 చైనాకు చెందిన ‘హానర్’ సంస్థ తయారు చేసిన ‘లైట్నింగ్’ అనే రోబో ఈ రేసును కేవలం 50 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసింది. ప్రస్తుతం మనుషుల పేరు మీద ఉన్న ప్రపంచ రికార్డు (57 నిమిషాల 20 సెకన్లు) కంటే ఇది ఏడు నిమిషాలు వేగవంతం కావడం విశేషం.

మరో విశేషం ఏంటంటే గతేడాది అత్యంత వేగవంతమైన రోబో 2 గంటల 40 నిమిషాలు తీసుకుంటే, ఈ ఏడాది కేవలం 50 నిమిషాల్లోనే రేస్  పూర్తి చేయడం టెక్నాలజీ పెరుగుదలకు నిదర్శనం.

ఈ రోబోల ప్రత్యేకతలు  
సాధారణంగా వేగంగా పరుగెత్తినప్పుడు వచ్చే వేడిని తట్టుకోవడానికి, వీటిలో స్మార్ట్‌ఫోన్లలో ఉండే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని వాడారు. అలాగే  ఈసారి 40% రోబోలు రిమోట్ అవసరం లేకుండా, వాటిలోని సెన్సార్లు, ఏఐ (AI) సాయంతో దారిని వెతుక్కుంటూ సొంతంగా పరుగెత్తాయి. ఇంకా ఇవి అచ్చం మనుషుల్లాగే పరుగెత్తడానికి వీలుగా వీటి కాళ్లను 90 నుండి 95 సెంటీమీటర్ల పొడవుతో డిజైన్ చేశారు.

►ALSO READ | చైనాలో ప్రైవేట్ స్కూల్స్ బ్యాన్? విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం!

 ఆశ్చర్యపరిచిన రోబో మార్షల్
కేవలం పరుగెత్తడమే కాదు, ఒక రోబో ట్రాఫిక్ పోలీస్‌లా వ్యవహరిస్తూ చేతి సైగలతో, మాటలతో పరుగువీరులకు దారి చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. అయితే, కొన్ని రోబోలు పరుగు ప్రారంభంలో తడబడటం, దారి తప్పడం వంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా చేశాయి.

చైనా ప్లాన్ ఏంటి?
రోబోటిక్స్ రంగంలో అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకోవాలని చైనా టార్గెట్ పెట్టుకుంది. అగిబోట్, యూనిట్రీ వంటి చైనా కంపెనీలు ఇప్పటికే వేల సంఖ్యలో రోబోలను తయారు చేసి విక్రయిస్తున్నాయి.

 

©️ VIL Media Pvt Ltd.