
చైనా ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యను కేవలం ఒక హక్కుగా చూడాలే తప్ప, దానిని వ్యాపారంగా మార్చి లాభాలు ఆర్జించకూడదని ప్రైవేట్ పాఠశాలల నిర్వహణపై కీలక ఆంక్షలు విధించింది. పేద మధ్యతరగతి కుటుంబాలపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక అంతరాలను తగ్గించి అందరికీ నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందించడం లక్ష్యంగా 6 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లలకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా విద్యాబోధన చేయాలని ఆదేశించింది. ఇకపై వ్యాపారవేత్తలు ప్రైవేట్ పాఠశాలలు నడపకూడదని నిషేధం విధించింది.
రిపోర్టుల ప్రకారం.. 2026 విద్యాసంవత్సరానికి గాను కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలలన్నీ తప్పనిసరిగా లాభాపేక్ష లేని సంస్థలుగా నమోదు చేసుకోవాలి. 6 నుంచి 15 ఏళ్ల వయస్సు గల పిల్లలకు నిర్భంధ విద్యను అందించాలి. ప్రైవేట్ వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు లాభాల కోసం కొత్తగా ప్రైవేట్ పాఠశాలలను స్థాపించడంపై పూర్తి నిషేధం విధించారు.తొమ్మిదేళ్ల నిర్బంధ విద్యా కాలంలో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయకుండా, నాణ్యమైన విద్యను అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోనుంది. పాఠశాల గంటల తర్వాత ఇచ్చే ప్రైవేట్ ట్యూషన్ల పై కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది.
ఈ నిర్ణయం వెనుక సామాజిక కారణాలు..
చైనా ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని లోతైన కారణాలు ఉన్నాయి..జననాల రేటు పెంచడం, విద్యావ్యవస్థలో పోటీ తగ్గించడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం వంటి సామాజిక లక్ష్యాలతో చైనా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
జననాల రేటు పెంచడం.. చైనాలో ప్రస్తుతం జననాల రేటు గణనీయంగా తగ్గుతోంది. పిల్లల చదువుల కోసం అయ్యే భారీ ఖర్చులే దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వం గుర్తించింది. విద్యా ఖర్చులు తగ్గిస్తే, దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఆసక్తి చూపుతారని ప్రభుత్వం ఆశిస్తోంది.
విద్యా వ్యవస్థలో పోటీని తగ్గించడం..ప్రైవేట్ పాఠశాలల మధ్య ఉన్న విపరీతమైన పోటీ వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనిని నివారించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం..ప్రైవేట్ పాఠశాలల ఆధిపత్యం తగ్గించడం ద్వారా, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ,విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది చైనా ప్రభుత్వం.
►ALSO READ | స్కైడైవింగ్‌లో ప్రమాదం: స్టేడియం స్కోర్‌బోర్డ్‌కు వేలాడిన పారాచూటర్.. తృటిలో తప్పిన ముప్పు!
అయితే ప్రభుత్వం నిర్ణయంపై కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలు లేకపోతే తమ పిల్లలకు ఉన్నత స్థాయి పోటీని తట్టుకునే నైపుణ్యాలు ఎలా అందుతాయనేది వారి ప్రశ్న. అయినప్పటికీ విద్య ప్రజాహక్కు అది లాభాలను ఆర్జించే యంత్రం కాదు అనే నినాదంతో చైనా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
చైనా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ విద్యా వ్యవస్థలో ఒక కొత్త చర్చకు దారితీసింది. విద్యను వ్యాపార కోణం నుంచి వేరు చేసి, సామాజిక బాధ్యతగా మార్చడంలో చైనా విజయం సాధిస్తే, అది ఇతర దేశాలకు కూడా ఒక పాఠంలా మారుతుందని ఆశిస్తున్నాయి.