Reading Time: 2 minutes
Shakeel Noorani Arrested Actors Serious Allegations Explained

Shakeel Noorani: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి అఘాయిత్యాలు జరుగుతున్న సంఘటనలు అప్పుడప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి. ఇప్పుడు బాలీవుడ్‌లో అలాంటి మరో ఘటన కలకలం రేపుతోంది. 33 ఏళ్ల నటి చేసిన ఫిర్యాదు ఆధారంగా సీనియర్ దర్శకుడు, నిర్మాత షకీల్ నూరానీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక దాడి, రహస్యంగా వీడియో రికార్డ్ చేయడం, బెదిరింపులు, బలవంతంగా మాత్రలు వేయడం వంటి తీవ్ర ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి.  ‘బడే దిల్ వాలా’, ‘జోరు కా గులామ్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన షకీల్ నూరానీ వయసు 73 సంవత్సరాలు. ఒక ప్రాజెక్టు స్క్రిప్ట్ గురించి మాట్లాడేందుకు ఇంటికి పిలిపించుకుని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు 33 ఏళ్ల నటి మాల్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నూరానీ కోసం గాలింపు చేపట్టారు.

పోలీసుల దర్యాప్తులో నూరానీ మహారాష్ట్రలోని సతారా జిల్లా మేధా ప్రాంతంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 8న మాల్వానీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ముంబైకి తరలించింది. అనంతరం  పలు సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నూరానీని బోరివలి హాలిడే కోర్టులో హాజరుపరచగా, తదుపరి విచారణ కోసం ఆయనను ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించినట్లు సమాచారం. కేసులో ఆరోపణల దృష్ట్యా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదులో మరింత తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తనకు నూరానీతో 2016లో లోఖండ్‌వాలాలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో పరిచయం ఏర్పడిందని ఆమె తెలిపింది. ఆ సమయంలో సినిమా అవకాశాల కోసం తనను సంప్రదించవచ్చని నూరానీ చెప్పినట్లు ఆమె పేర్కొంది. అనంతరం స్క్రిప్ట్ చదివేందుకు మాల్వానీలోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడు తనకు కూల్‌డ్రింక్ ఇచ్చారని, అది తాగిన కొద్దిసేపటికే స్పృహ కోల్పోయానని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

ఆ సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు రహస్యంగా వీడియో రికార్డ్ చేసినట్లు నటి ఆరోపించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని, ఈ విషయం పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరిస్తూ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గర్భం రాకుండా ఉండేందుకు తనకు బలవంతంగా మాత్రలు వేయించేవాడని కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. మరోవైపు షకీల్ నూరానీ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ గోయార్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన క్లయింట్‌పై కుట్రపూరితంగా ఆరోపణలు చేశారని ఆయన వాదించారు. కోర్టులో నేరం రుజువయ్యే వరకు నూరానీని దోషిగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. విచారణ ముందుకు సాగిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. ఈ ఘటన మరోసారి సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే యువత ఎదుర్కొనే భద్రతా సమస్యలపై చర్చకు దారితీసింది. సినిమా రంగంలో ఎదగాలనే కలతో పరిశ్రమలోకి అడుగుపెట్టే వారికి అవకాశాల పేరుతో వేధింపులు ఎదురైతే వాటిపై చట్టపరమైన సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది.