Reading Time: 2 minutes

రాజస్థాన్‌పై రింకు సింగ్, అనుకూల్ కిరాక్ బ్యాటింగ్.. ఐపీఎల్లో కేకేఆర్‌కు తొలి విజయం

Caption of Image.

KKR vs RR:  ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఓటమి కోరల్లో ఉన్న జట్టును రింకూ సింగ్ తన ఫినిషింగ్ టచ్‌తో గట్టెక్కించి, స్టేడియాన్ని హోరెత్తించాడు. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే రాజస్థాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, అజింక్య రహానే ఇద్దరూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో కేకేఆర్ 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రాజస్థాన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో రోవ్‌మన్ పావెల్ (23), అంగక్రిష్ రఘువంశీలను అవుట్ చేసి కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లాడు. కామెరాన్ గ్రీన్ (27) కాసేపు పోరాడినా రవి బిష్ణోయ్ అతడిని అడ్డుకున్నాడు. 

రింకూ సింగ్ ‘మెరుపు’ ఇన్నింగ్స్: 
ఒకానొక దశలో కేకేఆర్ ఓటమి ఖాయమనిపించింది. కానీ, క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్, అనుకూల్ రాయ్ బాధ్యతాయుతంగా ఆడారు. మొదట సింగిల్స్‌తో స్కోర్ బోర్డును నడిపించిన ఈ జోడీ, చివరి ఓవర్లలో ఒక్కసారిగా గేర్ మార్చింది. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 11 పరుగులు అవసరమవగా.. రింకూ సింగ్ తన విశ్వరూపం చూపించాడు. వరుసగా రెండు ఫోర్లు, ఒక కళ్లు చెదిరే సిక్సర్ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ క్రమంలోనే రింకూ సింగ్ తన కెరీర్‌లో మరో అద్భుతమైన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

►ALSO READ | IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో.. పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్

రాజస్థాన్ బౌలింగ్:
రాజస్థాన్ బౌలర్లలో రవీంద్ర జడేజా 2 వికెట్లతో ఆకట్టుకోగా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, రవి బిష్ణోయ్, యశ్ రాజ్ పుంజా తలో వికెట్ పడగొట్టారు. అయితే చివరి నిమిషంలో రింకూ సింగ్‌ను అడ్డుకోవడంలో రాజస్థాన్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. మొదట్లో అద్భుతమైన బౌలింగ్ తో కేకేఆర్ అడ్డుకున్నప్పటికీ, చివర్లో మాత్రం ఫెయిల్ కావడంతో.. ఐపీఎల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది.  

©️ VIL Media Pvt Ltd.