
కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుపెట్టి దక్షిణాదికి అన్యాయం చేసే కుట్ర చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.ఆ కుట్రలను ఇండియా కూటమి పసిగట్టి తిప్పికొట్టిందన్నారు. ఆ బిల్లును వీగిపోయేలా చేసిన ఇండియా కూటమి పక్షాలకు అభినందనలు తెలిపారు పొంగులేటి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదన్నారు..
మంత్రి సీతక్కతో కలిసి మేడారం సమ్మక్కసారక్కను దర్శించుకున్న ఆయన.. మేడారం మాస్టర్ ప్లాన్ చివరి దశలో ఉన్న పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కొద్దిరోజుల క్రితం గద్దెల ప్రాంగణంలో స్తానిక పూజారి కుమారుడు యూవిన్ కాలు విరగడం బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ఇప్పటికే బాలుడి తల్లికి దేవాదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చామన్నారు. ఎంత ఖర్చు ఐనా పర్వాలేదు. కృత్రిమ కాలు పెట్టిస్తామని చెప్పారు పొంగులేటి.
►ALSO READ | తెలంగాణపై కామెంట్స్ వివాదం.. ఏమాత్రం తగ్గని తేజస్వీ సూర్య.. క్షమాపణలు చెప్పిన కేంద్రమంత్రి
మహిళల మీద బీజేపీది కపట ప్రేమ: సీతక్క
మంత్రి సీతక్క మాట్లాడుతూ… మోడీ ప్రభుత్వం మహిళల మీద కపటప్రేమ, నాటకాలు మొదలు పెట్టింది. మహిళల బిల్లు అని చెప్పి డీ లిమిటేషన్ ద్వారా సౌత్ ఇండియాకు ప్రాధాన్యత తగ్గించే కుట్రలు చేస్తున్నారు .మహిళా బిల్లు పేరుతో జరుగుతున్న కొత్త కుట్రలివి. దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే దేశాన్ని పాలించేందుకు ఈ తరహా కుట్రలకు తెరలేపారు . బిజెపి మాతృ సంస్థ RSSలో మహిళలకు ప్రాధాన్యత ఉందా.. మహిళలకు సభ్యత్వం ఉందా.. ముందు మీ చిత్తశుద్ధిని నిరూపించుకొండి. బిజెపి పుట్టినప్పటి నుంచి ఒక్కసారైనా మహిళను జాతీయ అధ్యక్షురాలిని చేశారా… మహిళలను గౌరవించి ప్రోత్సహించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్. బెంగాల్, తమిళనాడులో మహిళా ఓట్ల కోసమే బీజేపీ ఈ డ్రామా. జనగణన లెక్కలు తేలకుండా ఎలా డీ లిమిటేషన్ చేస్తారు అని సీతక్క ప్రశ్నించారు.