
హైదరాబాద్‌లోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుట్ బ్రిడ్జిపై విషాదం చోటుచేసుకుంది. ఏప్రిల్ 19న తెల్లవారుజామున అతి వేగంతో దూసుకొచ్చి ఓ బీఎండబ్ల్యూ కారు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే.. శ్యామ్ రాజ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి పల్సర్ బైక్‌పై జూబ్లీహిల్స్ నుంచి ఐకియా వైపు వెళ్తున్నారు. కేబుల్ బ్రిడ్జి అందాలను చూసి ముచ్చటపడ్డ ఆ దంపతులు ఫోటోలు దిగేందుకు అక్కడ ఆగారు. భర్త శ్యామ్ రాజ్ బ్రిడ్జిపై నిలబడి ఉండగా, భార్య తన మొబైల్‌లో ఫోటోలు తీస్తోంది. సరిగ్గా అదే సమయంలో మృత్యువు బెంజ్ కారు రూపంలో దూసుకొచ్చింది.అతివేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు (నెంబర్WB 06 B 7003).. ఫోటో దిగుతున్న శ్యామ్ రాజ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి రక్తపు మడుగులో ఉన్న శ్యామ్ రాజ్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.
►ALSO READ | హైదరాబాద్ రిచ్ కిడ్స్ టార్గెట్.. ఇన్‌స్టాగ్రామ్ లో మైనర్లకు వల.. ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల దోపిడీ!
ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న శ్యామ్ రాజ్ పరిస్థితి విషమించడంతో ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కంటిముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో భార్య కన్నీరుమున్నీరవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.