
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో డ్రోన్ ప్రదర్శనలో అపశృతి చోటు చేసుకుంది. వ్యవసాయ పనుల కోసం తీసుకువచ్చిన డ్రోన్ ఒక్కసారిగా అదుపు తప్పడంతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
అసలేం జరిగిందంటే.? కుల్కచర్ల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతుల అవసరాల కోసం కొత్తగా ఒక డ్రోన్‌ను కొనుగోలు చేశారు. ఈ డ్రోన్ పనితీరును పరిశీలించేందుకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. అయితే ఆపరేటింగ్ చేస్తున్న సమయంలో సాంకేతిక లోపంతో డ్రోన్ ఒక్కసారిగా అదుపు తప్పింది.
నిలకడ కోల్పోయిన డ్రోన్ నేరుగా ఎమ్మెల్యే వైపు దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో డ్రోన్ రెక్కలు తగిలి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాలికి గాయమైంది. ఆయనతో పాటే ఉన్న తిరుమలపూర్ వెంకటయ్య గౌడ్ కాలికి తీవ్ర రక్తగాయం కాగా రాంపూర్ సర్పంచ్ తిరుపతయ్య చేతి బొటనవేలు తెగిపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు బాధితులను హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సహా మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.