
- బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదని రుజువైంది
- మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్న
హౌరా/బరుయిపూర్: బీజేపీ పతనం మొదలైందని, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుతం మైనారిటీలో ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్మమతా బెనర్జీ ఆరోపించారు. శనివారం హౌరాలోని ఉలుబేరియా, దక్షిణ 24 పరగణాలలోని బరుయిపూర్‌లలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె మాట్లాడారు.
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదని, నిన్నటి సంఘటనలతో రుజువైందన్నారు. ఇద్దరు మిత్రపక్షాల మద్దతుతోనే ఈ ప్రభుత్వం నెట్టుకొస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు.
ఢిల్లీలో మోదీ పతనం మొదలైందని, రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ద్వారా అది ఖాయమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని, బెంగాల్‌ను విభజించే కుట్రలను తాము అడ్డుకుంటామని పేర్కొన్నారు. బిహార్ సీఎం నితీశ్‌కుమార్ రాజీనామా అంశాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ తన అవసరం తీరాక మిత్రపక్షాలను ఎలా పక్కన పెడుతుందో ప్రజలు గమనించాలని కోరారు.
బీజేపీ ప్రవేశపెట్టే నగదు పథకాల ఫామ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మీ వివరాలు సేకరించి ఖాతాల నుంచి డబ్బులు కాజేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 2026 బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలక మలుపు అవుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.
వేరే పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే: అభిషేక్ బెనర్జీ
బెంగాల్‌లో టీఎంసీకి కాకుండా మరే ఇతర పార్టీకి వేసే ఓటైనా అది బీజేపీకి వేసినట్లేనని టీఎంసీ నేత అభిషేక్‌బెనర్జీ అన్నారు. ముర్షిదాబాద్, ఫరక్కాలో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీ, బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో బీజేపీ ప్రభావాన్ని సమర్థంగా అడ్డుకుంటున్నది టీఎంసీ మాత్రమేనని పేర్కొన్నారు. రెండేండ్లుగా ప్రజల కష్టాల్లో తోడుగా నిలిచిన కాంగ్రెస్ ప్రతినిధి ఒక్కరు కూడా లేరని ఆరోపించారు.
కాంగ్రెస్, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు.. బీజేపీకి ఏజెంట్లుగా పని చేస్తున్నాయని విమర్శించారు.బీజేపీని ఓడించాలంటే హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు టీఎంసీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్పేరిట కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని, రాజ్యాంగాన్ని బలవంతంగా మార్చాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.