Reading Time: 2 minutes

వరంగల్ లో ‘యంగ్ ఇండియా’కు లైన్ క్లియర్

Caption of Image.
  • బీఈడీ కాలేజీ భూముల్లో ఏర్పాటుకు నిర్ణయం
  •  కేయూ భూముల ఎంపిక రాజకీయంతో రూ.200 కోట్ల ప్రాజెక్ట్ ఆలస్యం 
  • ఎమ్మెల్యే నాయిని చొరవతో ప్రత్యామ్నాయం 
  •  బీఈడీ కాలేజీ చుట్టూరా అందుబాటులో 8 నుంచి 9 ఎకరాల ల్యాండ్ 

వరంగల్, వెలుగు:  వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్ ను హనుమకొండ సెంటర్లోని బీఈడీ కాలేజీ భూముల్లో ఏర్పాటు చేయనున్నారు. వరంగల్​ పశ్చిమకు సీఎం రేవంత్​రెడ్డి ఏడాది కిందనే స్కూల్​ను మంజూరు చేశారు. స్కూల్​ నిర్మాణానికి దాదాపు 5 ఎకరాల భూమి అవసరం. కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కొన్ని పార్టీలు, విద్యార్థి సంఘాలు రాజకీయాలు చేయడంతో ప్రాజెక్టు ముందుకు కదలలేదు. తాజాగా ప్రత్యామ్నాయ భూమిని ఖరారు చేయడంతో స్కూల్​ నిర్మాణానికి గ్రీన్​ సిగ్నల్ లభించినట్లయ్యింది.   

ఏడాది ఆలస్యం..

కాకతీయ యూనివర్సిటీకి గతంలో 1200 ఎకరాల భూములుండగా, 46 ఏండ్లలో కబ్జాలు, అక్రమ నిర్మాణాలు జరగగా ప్రస్తుతం 600 నుంచి 650 ఎకరాల భూములున్నాయి. పలివేల్పుల, గుండ్లసింగారం, హనుమాన్​నగర్ వైపు కబ్జాల నుంచి భూములు వెనక్కు తీసుకునేలా అడుగులు పడ్డాయి. భీమారం, పలివేల్పుల వైపున్న కేయూ భూముల్లో మొన్నటివరకు ఉన్న సీఆర్పీఎఫ్ బెటాలియన్​ తరలివెళ్లింది. ఈ క్రమంలో యంగ్ ఇండియా స్కూల్​ నిర్మాణం కోసం కేయూ భూములు ఇచ్చేందుకు మెజార్టీ విద్యార్థి సంఘాలు సానుకూలం వ్యక్తం చేసినా, విపక్ష పార్టీలకు అనుబంధంగా ఉండే ఒకట్రెండు స్టూడెంట్ ఆర్గనైజేషన్లు అడ్డుకున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో కేయూ భూములను ఇచ్చే ప్రసక్తి లేదని ఆందోళనకు దిగాయి. దీంతో ఏడాది కాలం పాటు స్కూల్​ నిర్మాణ పనులు ముందుకుసాగలేదు.

సిటీ మధ్యలో బీఈడీ కాలేజీ భూములు..

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ నిర్మాణం కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రస్తుతం హనుమకొండ సిటీ మధ్యలో ఉండే బీఈడీ కాలేజీ భూముల్లోకి మారింది. స్కూల్​ మంజూరు జరిగి ఏడాది కావడం, రూ.200 కోట్ల ప్రాజెక్ట్​ను సక్సెస్​ చేసుకునే క్రమంలో వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి చొరవ చూపారు. జిల్లా అధికారులు ప్రత్యామ్నాయం వెతికారు. చివరగా హనుమకొండ పబ్లిక్​ గార్డెన్​ ప్రాంతంలోని బీఈడీ, డైట్​ కాలేజీలకు సంబంధించి 8 నుంచి 9 ఎకరాల భూములు ఉన్నట్లు గుర్తించారు.

ముందు వెనకాల బీఈడీ, డైట్​ కాలేజీలు, పబ్లిక్​ గార్డెన్​వైపు టీటీడీ కల్యాణ మండపం, మర్కజీ స్కూల్​నుంచి ఏషియన్ మాల్ వెళ్లే దారిలో ఎల్బీహెచ్ఎస్​స్కూల్ ఉండే ఈ భూములు యంగ్ఇండియా స్కూల్​ నిర్మాణానికి అనుకూలమని భావించి ప్రతిపాదనలు పంపారు. కాగా, ఈ నెలాఖరు లేదంటే మే మొదటి వారంలో సీఎం రేవంత్​రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు సిద్ధంగా ఉన్నారు. 

2025 మేలో మంజూరు.. 

రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడుతలోనే ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 6 చోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేసింది. ఒక్కో స్కూల్​ నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి కేయూ మేధావులు, విద్యావేత్తలు, అధికారులు, విద్యార్థి సంఘాలతో పలుమార్లు భేటీ అయ్యారు. యంగ్ ఇండియా స్కూల్​ ప్రాధాన్యత వివరించి, కేయూ భూముల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో అందరూ ఓకే అనడంతో అదే ఏడాది జూన్ 17న హైదరాబాద్​లో జరిగిన కేయూ పాలకమండలి సమావేశంలో కేయూ భూముల్లో యంగ్ ఇండియా స్కూల్​ నిర్మాణానికి ఆమోదం చేయించారు. 

©️ VIL Media Pvt Ltd.