Reading Time: < 1 minute

బిల్లుల కోసం మాజీ  సర్పంచ్ ఆందోళన

Caption of Image.
  • స్కూల్​లో రూముకు తాళం వేసి నిరసన
  • అరెస్ట్​ చేసిన పోలీసులు

ఇల్లంతకుంట, వెలుగు: తమ హయాంలో చేసిన గ్రామ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వాలని నిరసన తెలుపుతున్న మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకట నర్సింహారెడ్డి దంపతులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌‌‌‌కు తరలించారు. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలోని ప్రభుత్వ స్కూల్​లో అనసూయ హయాంలో మూడు గదులు నిర్మించగా, ఆ బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. దీంతో ఆ గదులకు గురువారం తాళం వేశారు. వాటిని పోలీసులు పగులగొట్టారు. దీంతో మళ్లీ శుక్రవారం మళ్లీ అనసూయ వెంకటనర్సింహారెడ్డి దంపతులు వచ్చి గదికి తాళం వేశారు.

తమ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ అక్కడే బైఠాయించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు. వారి అరెస్టును మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అక్కనపల్లి కరుణాకర్ ఖండించారు. గ్రామ అభివృద్ధి కోసం పలువురు సర్పంచులు తమ ఆస్తులను తాకట్టు పెట్టి పనిచేశారని, నాలుగేళ్లుగా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. చేసిన పనులకు ఎంబీ రికార్డుల ప్రకారం ప్రభుత్వం నిధులు విడుదల చేసి మాజీ సర్పంచులను ఆదుకోవాలని కోరారు.

©️ VIL Media Pvt Ltd.