Reading Time: < 1 minute

రాజేంద్రనగర్ ఆర్డీవోకు నెల రోజుల జైలు శిక్ష… కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీర్పు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: న్యాయస్థానం ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకుగాను రాజేంద్రనగర్ ఆర్డీవో, భూసంస్కరణల ట్రైబ్యునల్ అధీకృత అధికారి కొప్పుల వెంకటరెడ్డికి హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష వేసింది. అంతేగాక, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్‌‌‌‌లోని 74.97 ఎకరాల పూర్వీకుల భూమి వివాదంపై నవాబ్ మహమ్మద్ యూసుఫుద్దీన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదాన్ని విచారించి 6 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని హైకోర్టు ఆర్డీవోను గతంలో ఆదేశించింది. 

కోర్టు గడువు విధించినప్పటికీ ఆర్డీవో స్పందించకపోవడంతో బాధితుడు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో తీరును తప్పుబట్టిన కోర్టు.. రికార్డులను పరిశీలించకుండా  2 రోజుల ముందు మొక్కుబడిగా పాత ఉత్తర్వులనే జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. న్యాయస్థానంపై ప్రజల్లో విశ్వాసాన్ని , గౌరవాన్ని పెంచడానికి కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఆర్డీవోకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే అప్పీలుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును రెండు వారాలపాటు నిలిపివేసింది.

©️ VIL Media Pvt Ltd.