Reading Time: < 1 minute

బ్రీత్‌‌‌‌ అనలైజర్‌‌‌‌ పరీక్ష చేసే అధికారం మీకెక్కడిది?…పంజాగుట్ట పోలీసులను నిలదీసిన హైకోర్టు

Caption of Image.
  • ఏ అధికారంతో అడ్వకేట్ సుబ్బారావుకు టెస్టు చేశారు?
  •     కౌంటర్ వేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పోలీసు స్టేషన్‌‌‌‌కు వచ్చిన న్యాయవాది సుబ్బారావుకు ఏ అధికారంతో బ్రీత్‌‌‌‌ అనలైజర్‌‌‌‌  పరీక్షలు నిర్వహించారని పంజాగుట్ట పోలీసులను హైకోర్టు శుక్రవారం ప్రశ్నించింది. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు, బ్రీత్‌‌‌‌ అనలైజర్‌‌‌‌ పరీక్షలు నిర్వహించడం తదితరాలను పరిశీలించడానికి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదు గురించి తెలుసుకోవడానికి వెళ్లిన తనపై పంజాగుట్ట పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని న్యాయవాది సుబ్బారావు.. హైకోర్టులో పిటిషన్‌‌‌‌  వేశారు. 

దీనిపై జస్టిస్‌‌‌‌  ఈవీ వేణుగోపాల్‌‌‌‌  శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌  తరఫు  న్యాయవాది వి.రఘునాథ్‌‌‌‌  వాదనలు వినిపిస్తూ ఫిర్యాదు గురించి తెలుసుకోవడానికి వెళితే బ్రీత్‌‌‌‌ అనలైజర్‌‌‌‌  పరీక్ష నిర్వహించారన్నారు. మద్యం స్థాయి 27 శాతం ఉందని, ఇది డ్రైవింగ్‌‌‌‌కు అనుమతించే పరిధిలోనే ఉందన్నారు. పోలీసులతోపాటు సివిల్‌‌‌‌ డ్రెస్‌‌‌‌లో ఉన్న వారంతా న్యాయవాదిని చుట్టుముట్టి దుర్భాషలాడుతూ అనుచితంగా ప్రవర్తించారన్నారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారని, అంతేకాకుండా  బెదిరింపులు ప్రారంభించారని, గురువారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించారని పేర్కొన్నారు. 

పోలీసుల తరఫు న్యాయవాది మహేశ్​  రాజె వాదిస్తూ పిటిషనర్‌‌‌‌  ఇచ్చిన ఫిర్యాదును మెజిస్ట్రేట్‌‌‌‌  అనుమతితో నమోదు చేశామన్నారు. అలాగే గాయని మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదును కూడా నమోదు చేశామన్నారు. ఇరు పక్షాల వాదనలతోపాటు వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి.. పోలీసు స్టేషన్‌‌‌‌కు వచ్చిన వ్యక్తికి ఏ అధికారంతో బ్రీత్‌‌‌‌ అనలైజర్‌‌‌‌ పరీక్షలు నిర్వహించారో చెప్పాలని ఆదేశించారు. ఈ సంఘటనకు చెందిన పూర్వాపరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్‌‌‌‌  పోలీసు కమిషనర్, డీజీపీ, ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌ఓ, సీఐ రామకృష్ణకు వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

©️ VIL Media Pvt Ltd.