Reading Time: < 1 minute

హైదరాబాద్ బేగంపేటలో విషాదం.. పూజ చేస్తుండగా చీరకు నిప్పంటుకుని రిటైర్డ్ ప్రిన్సిపల్ మృతి

Caption of Image.

హైదరాబాద్: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధి శ్యామ్ లాల్ బిల్డింగ్ సమీపంలోని ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి విజయలక్ష్మి అనే రిటైర్డ్ ప్రిన్సిపల్ మృతి చెందింది.ఇంట్లో పై అంతస్తులో నివాసం ఉంటున్న విజయలక్ష్మి ఇంట్లో దేవుడికి దీపం వెలిగిస్తున్న క్రమంలో చీర కొంగుకు అకస్మాత్తుగా నిప్పంటుకుంది. 

చీరకు నిప్పంటుకున్న వెంటనే భయాందోళనకు గురైన విజయలక్ష్మి బెడ్ రూమ్లోకి వెళ్లగా ఆ మంటలు దుప్పటికి అంటుకోవడంతో మంటలు తీవ్రత మరింత పెరిగింది. దీంతో ఆమె ఒళ్ళంతా మంటలు అంటుకొని తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఇంట్లో నుండి పొగలు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అదే ఇంట్లో రెండవ అంతస్తులో తన కూతురు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయిన విజయలక్ష్మి ఇంట్లోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. 

ప్రతిరోజు ఆమె పూజ చేస్తుందని ఆమె కూతురు తెలిపారు. అకస్మాత్తుగా దేవుడికి వెలిగించిన దీపం ఆమె చీరకు అంటుకొని మంటలు చెలరేగడంతో శరీర భాగాలు కాలిపోయి మృతి చెందినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

©️ VIL Media Pvt Ltd.