
- చరిత్రలో లిఖించదగిన రోజు: సీఎం రేవంత్
న్యూఢిల్లీ, వెలుగు: మహిళా రిజర్వేషన్ల ముసుగులో ఎన్డీయే సర్కార్ తెచ్చిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం జాతీయ విపత్తును నివారించిన రోజుగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే మరపురాని రోజు అని అభిప్రాయపడ్డారు. శుక్రవారం లోక్‌సభలో కేంద్రం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు.
‘లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులు, ప్రతిపక్ష నాయకులు అంతా ఏకమై ఒక జాతీయ విపత్తును నివారించిన సందర్భం ఇది. నల్ల బిల్లులను ఓడించేందుకు కఠిన పరిస్థితుల్లోనూ ఐకమత్యంతో, సాహసంతో నిలిచిన మిత్రపక్షాల నాయ కులకు కృతజ్ఞతలు. ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, లాలు ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, ఫరూఖ్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అర్వింద్ కేజ్రీవాల్‌తోపాటు కమ్యూనిస్టు పార్టీల నాయకు లందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. జైహింద్’అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.