
- ముందే టాస్, మ్యాచ్ ఎవరు గెలుస్తరో చెప్తరట
- ఫేస్బుక్, ఇన్‌స్టాలో, యూట్యూబ్ రీల్స్‌లో ప్రచారం
- రూ.2 వేల వరకు సబ్స్క్రిప్షన్ ఫీజు
- వాట్సాప్, టెలీగ్రామ్‌లో అన్ని వివరాలు షేర్ చేస్తరు
- బెట్టింగ్‌లు పెట్టి నష్టపోతున్న అత్యాశాపరులు
హైదరాబాద్ సిటీ, వెలుగు : ‘ఐపీఎల్ మ్యాచుల్లో టాస్ఎవరు గెలుస్తారో ముందే చెప్తం.. మ్యాచ్ ప్రారంభం కాకముందే గెలిచేవాళ్లెవరో రివీల్చేస్తం. మా ప్రిడిక్షన్100 శాతం నిజమైతది.. జస్ట్రూ.వెయ్యి కడితే చాలు.. వారం రోజుల పాటు అన్ని వివరాలు పక్కాగా రివీల్చేస్తం.. దీంతో బెట్టింగ్‌లో లక్షలు సంపాదించొచ్చు’ అంటూ నగరంలో కొన్ని ముఠాలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్రీల్స్లో ఈ తరహా ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. వీళ్ల ప్రిడిక్షన్‌ను నమ్ముతున్న అమాయక జనాలు ఈజీ మనీ మీద ఆశతో లక్షలకు లక్షలు బెట్టింగ్పెట్టి నష్టపోతున్నారు. కొందరు డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
టాస్, మ్యాచ్, సెక్షన్..
‘ఐపీఎల్ మ్యాచ్ప్రిడిక్షన్’ చేసే గ్యాంగ్‌లు టాస్, మ్యాచ్, సెక్షన్ అనే మూడు విభాగాల్లో డిటెయిల్స్షేర్చేస్తున్నారు. క్రికెట్మ్యాచ్ లు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 7.30 గంటలకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం మూడున్నరకు స్టార్టవుతున్నాయి. అయితే, టాస్ఎవరు గెలుస్తారన్నది వీళ్లు మధ్యాహ్నం12 గంటలకే వాట్సాప్‌గ్రూపుల్లో రివీల్చేస్తున్నారు. మ్యాచ్‌లో విజేత ఎవరో కూడా ముందే చెప్తున్నారు. ఇందులో భాగంగా వీళ్లు మైండ్గేమ్ఆడుతున్నారు. ఏ జట్టు బలమైనదో తెలుసుకాబట్టి అదే గెలుస్తుందని జోస్యం చెప్తున్నారు.
టాస్, మ్యాచ్గెలిచే విషయాల్లో నిజమయ్యే సంభావ్యత 50 శాతం కావడంతో తప్పు జరిగినప్పుడు ఏదో చెప్పి మ్యానేజ్చేస్తున్నారు. ఇక కష్టతరమైన సెక్షన్గురించి కూడా చెప్పేస్తున్నారు. సెక్షన్అంటే ఏ ఓవర్ లో ఎన్ని రన్స్ చేస్తారో చెప్పడం.. ఉదాహరణకు ఆరు ఓవర్ల పవర్ ప్లేలో మొదట బ్యాటింగ్ చేసే జట్టు తాము చెప్పిన రన్స్చేస్తుందని, కావాలంటే బెట్టింగ్ పెట్టుకోవాలని ఎంకరేజ్చేస్తున్నారు. దీంతో చాలా మంది వీరి ప్రిడిక్షన్ ను నమ్మి రెండింతలు డబ్బులు వస్తాయని లక్షల్లో మోసపోతున్నారు. అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి టాస్, మ్యాచ్, సెక్షన్లపై లక్షలు పెడుతూ నిమిషాల్లోనే బికార్లుగా మారుతున్నారు.
మ్యాచ్‌లు ముందే ఫిక్స్ అవుతాయట..
సాధారణంగా ఏ క్రికెట్మ్యాచ్ఫలితం ముందే ఎవరికీ తెలియదు. అలా తెలిస్తే ఏ ఫ్యాన్ కూడా ఆసక్తి చూపడు. ఈ విషయం అందరికీ తెలిసినా కొన్ని ప్రిడిక్షన్ముఠాలు తమకు ఏజెన్సీల నుంచి పక్కా సమాచారం వస్తుందని నమ్మించి వంచిస్తున్నారు. తాము రోజూ రూ.60 వేలు ఫీజు కింద ఏజెన్సీలకు కడతామని, వారు కోట్లలో చెల్లించి ఐపీఎల్మ్యాచ్లను ప్రభావితం చేస్తారని తమకు కాంటాక్ట్అయిన కస్టమర్లను నమ్మబలుకుతున్నారు.
అయితే, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తాము 10 మ్యాచుల్లో దాదాపు 9 కరెక్ట్ చెప్తామని, ఒక్కటి మాత్రం తప్పు చెప్తామంటున్నారు. తమ ప్రిడిక్షన్‌తో రోజూ రూ. లక్షలు సంపాదించేవారు ఉన్నారని, కావాలంటే వారి కాంటాక్ట్నంబర్ఇస్తామని మాట్లాడాలని సూచిస్తున్నారు. ఇంకొన్ని ప్రిడిక్షన్ముఠాలైతే ‘ఐపీఎల్లక్షల కోట్ల బిజినెస్‌తో కూడుకున్నదని, మ్యాచ్‌లన్నీ ఫిక్స్అవుతాయని, అందుకే…తమకు టాస్, మ్యాచ్, సెక్షన్ ముందే తెలుస్తుందని అంటున్నారు.
సోషల్ మీడియాలో పబ్లిసిటీ..
ప్రిడిక్షన్ముఠాలు కస్టమర్లను సంపాదించడానికి ప్రచారం మామూలుగా చేయడం లేదు. ప్రతి ఒక్కరినీ రీచ్కావడానికి ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్రీల్స్ను ఉపయోగించుకుంటున్నారు. కొందరు బయటి ప్రపంచానికి కనిపించకుండా ఉండేందుకు మాస్కులు, సూపర్మ్యాన్వేషధారణల్లో కనిపించి తమ ప్రిడిక్షన్ప్రచారం చేసుకుంటున్నారు. జోకర్‌గా, స్పైడర్మాన్ గా, చిలుక జ్యోతిష్యం చెప్పేవాళ్లలా, క్షుద్రపూజలు చేసి జరగబోయే మ్యాచ్ఫలితాన్ని ముందే చెప్పేస్తామని పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే అమెరికన్ప్రెసిడెంట్ట్రంప్వేషంలో ఐపీఎల్ప్రిడిక్షన్ఇస్తున్నారు. నోటీస్‌బోర్డుపై మ్యాచ్విన్నర్, టాస్విన్నర్, ఏ జట్టు ఎంత స్కోర్చేస్తుంది రాసి దాని పక్కన ఫలితాలపై పేపర్లు అంటించి ఒక్కొక్కటి తీస్తూ రివీల్చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. వీరు చెప్పిన దాంట్లో నిజమైనవాటినే సోషల్‌మీడియాలో పెడుతున్నారు.
అంచనా మాత్రమే…
ప్రిడిక్షన్ముఠాలు తమకు ఏజెన్సీలు ఉంటాయని, వారు మ్యాచ్‌లను ఫిక్స్చేసే స్థాయిలో ఉంటారని చెప్తున్నా అసలు నిజం అది కాదు. స్థానిక లెవెల్లో ప్రిడిక్షన్తీసుకునే వారు అంతర్జాతీయ స్థాయిలో ప్రిడిక్షన్చేసే వారితో జట్టు కడతారు. అక్కడివారు డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, క్రికెట్ఎక్స్పర్ట్లపై ఆధారపడతారు. వీరు వేల మ్యాచ్‌ల డేటాను కంప్యూటర్లలో ఫీడ్‌చేసి ఏఐ ద్వారా అల్గారిథమ్స్ తో ఏ జట్టు గెలుస్తుందో ఒక అంచనాకు వస్తారు. మరోవైపు డేటా ఎనలిస్టులు ప్రతి బంతిని ట్రాక్ చేస్తారు. ఒక బ్యాటర్ ఏ బౌలర్‌కి ఇబ్బంది పడుతున్నాడు? ఏ స్టేడియం చిన్నగా ఉంది? ఏది పెద్దగా ఉంది? ఏ స్టేడియంలో ఎక్కువ రన్స్వస్తాయి? వంటి అంశాలను చూస్తారు.
గతంలో ఆ రెండు జట్లు తలపడినప్పుడు ఎవరు పైచేయి సాధించారు? పిచ్, వాతావరణం, స్పిన్నర్లకు అనుకూలమా లేదా పేసర్లకా? వాతావరణం వల్ల తేమ వస్తుందా? అన్నది గమనిస్తారు. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ ను, మ్యాచ్జరిగే వేదికపై వారి రికార్డులను పరిశీలిస్తారు. సొంత గ్రౌండ్లో ఆడే జట్లకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో వీరి ప్రిడిక్షన్స్నిజమయ్యే అవకాశాలుంటాయి.
చాలా రీసెర్చ్ల ప్రకారం వీరి ప్రిడిక్షన్ కేవలం 60 నుంచి 70 శాతం వరకు మాత్రమే నిజమయ్యే అవకాశం ఉందని తేలింది. అయితే, క్రికెట్‌లాంటి గేమ్‌లో లాస్ట్బాల్వరకు ఫలితం తేలకుండా ఉత్కంఠగా సాగుతాయి. ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి కప్పులు పోగొట్టుకున్న జట్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి క్రికెట్ఆటపై ప్రిడిక్షన్ఆధారంగా బెట్టింగ్పెడితే నష్టపోయే అవకాశాలే ఎక్కువ…అదే ఇప్పుడు మన దగ్గరా జరుగుతోంది. పోలీసులు దీనిపై స్పందించి సీరియస్యాక్షన్తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు కోరుతున్నారు.
ప్రాణాలు తీస్కుంటున్నరు
మన రాష్ట్రంలో క్రికెట్బెట్టింగ్పెట్టి నష్టపోయి చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. 2023 నుంచి 2026 ఫిబ్రవరి నెల వరకు సుమారు 51 మంది బెట్టింగ్పెట్టి అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడ్డారు. గత నెల మియాపూర్‌కు చెందిన పాపయ్య క్రికెట్బెట్టింగ్తో లాస్అయి అప్పులపాలై తీర్చేదారి లేక ఊరేసుకున్నాడు. గత ఏడాది ఏప్రిల్నెలలో నగరానికి చెందిన ఓ ఎంటెక్స్టూడెంట్₹2.65 లక్షలు నష్టపోయి హాస్టల్ లోనే తనువు చాలించాడు.
నిరుడు మార్చిలోనే ₹3 లక్షలు పోగొట్టుకున్న సోమేష్ అనే ప్రైవేట్ ఉద్యోగి రైల్వే ట్రాక్‌పై పడుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బాధితుల్లో 80 శాతం మంది 18 నుంచి 35 ఏండ్ల లోపు వాళ్లే కావడం ఆందోళన కలిగించే అంశం. వీరంతా ప్రిడిక్షన్‌ను నమ్ముకునే మోసపోయారు. బెట్టింగ్‌ను నివారించేందుకు పోలీసులు కష్టపడుతన్నా అంతగా ఫలితాలు కనిపించడం లేదు. 2023- నుంచి ఈ ఏడాది వరకు రాష్ట్రంలో 1,456 కేసులు నమోదు చేయగా, దొరకని వారు ఎంతో మంది ఉన్నారు.