
- ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల హక్కులను లాక్కునేందుకు కుట్ర
- మోదీ బాలాకోట్, డీమానిటైజేషన్, ఆపరేషన్ సిందూర్ మెజీషియన్ అంటూ కామెంట్స్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మహిళా రిజర్వేషన్లతో సంబంధం లేదని, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దేశ రాజకీయ చిత్రపటాన్నే మార్చే ప్రయత్నం ఇది అని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఇది దేశ వ్యతిరేక చర్య అని విమర్శించారు.
మహిళా కోటా చట్ట సవరణలు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మూడు బిల్లులపై శుక్రవారం లోక్ సభలో జరిగిన చర్చలో రాహుల్ మాట్లాడారు. “మహిళలను అడ్డుపెట్టుకుని, వారి వెనుక దాక్కుని దేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది సిగ్గుచేటు” అని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసేందుకు ముందుకు వస్తే.. ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ఇస్తాయన్నారు.
దేశ చరిత్రలో ఓబీసీలు, దళితులు, మైనారిటీలు, మహిళల పట్ల జరిగిన “క్రూరమైన, నిర్దాక్షిణ్యమైన ప్రవర్తన” వాస్తవమని స్పష్టం చేశారు. “ఇక్కడ కులగణనను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. నా ఓబీసీ సోదర సోదరీమణులకు అధికారం, ప్రాతినిధ్యం ఇవ్వకుండా తప్పించుకోవాలని, బదులుగా వారి నుంచి అధికారాన్ని లాక్కోవాలని చూస్తున్నారు” అని ఆరోపించారు. దీని వెనక ఉన్న అసలు అజెండా “సంవిధానం(రాజ్యాంగం) కంటే ఉన్నతస్థానంలో మనువాదాన్ని నిలపడమే” అని విమర్శించారు. రాబోయే 15 ఏళ్ల వరకు ప్రాతినిధ్యం విషయంలో కులగణన ప్రభావం లేకుండా చూడాలని ప్రభుత్వం కోరుకుంటోందని కూడా ఆయన ఆరోపించారు.
“ఈ దేశ రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూసి మీరు (ప్రభుత్వం) భయపడుతున్నారు. మీ బలం క్షీణిస్తుందని భయపడి భారత రాజకీయ చిత్రపటాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు” అని విమర్శించారు. “మీరు జమ్మూ కాశ్మీర్‌లో ఇది చేశారు, అస్సాంలో చేశారు. ఇప్పుడు దేశమంతటా చేయాలని అనుకుంటున్నారు” అని ఆయన అన్నారు.
బీజేపీ అధికారంలో కొనసాగడం కోసం.. దక్షిణ, ఈశాన్య, చిన్న రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యాన్ని లాక్కోబోతోందని రాహుల్ మండిపడ్డారు. “ప్రభుత్వం చేస్తున్నది దేశద్రోహ చర్యకు తక్కువ ఏమీ కాదు. ఏ పరిస్థితిలోనూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇలా చేయనివ్వవు. దేశంపై దాడి చేయడానికి, ఓబీసీలు, దళితులకు సమాజంలో దక్కాల్సిన సరైన స్థానాన్ని దూరం చేయడానికి మీరు చేసే ఈ ప్రయత్నాన్ని ప్రతిపక్షాలన్నీ కలిసి ఓడిస్తాయి” అని ఆయన అన్నారు.
“మీరు ఓబీసీలను హిందువులంటారు. దళితులను హిందువులంటారు. కానీ దేశ అధికార నిర్మాణంలో వారికి ఎక్కడా చోటు ఇవ్వరు” అని విమర్శించారు. దక్షిణ, ఈశాన్య, చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని లాక్కోనివ్వబోమని ఆయన చెప్పారు. గత సంఘటనలను ప్రస్తావిస్తూ, మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజపేయి కూడా ఇలాంటి ప్రశ్నలనే ఎదుర్కొన్నారని, కానీ వారు “ప్రమాదాలను అర్థం చేసుకుని” ప్రధాని మోదీ తీసుకుంటున్నటువంటి చర్యలు చేపట్టలేదన్నారు.
మోదీ మెజీషియన్ అంటూ కామెంట్స్..
తాను చిన్నప్పుడు చూసిన మేజిక్ షోకు సంబంధించిన ఒక కథను చెబుతూ ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు చేయడంతో సభలో దుమారం రేగింది. ‘‘ మోదీ బాలాకోట్(సర్జికల్ స్ట్రైక్స్, డీమానిటైజేషన్, ఆపరేషన్ సిందూర్ మెజీషియన్” అని అభివర్ణిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇవి పార్లమెంటరీ మర్యాదలకు విరుద్ధమని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు ఫైర్ అయ్యారు. వీటిని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
రాహుల్ స్పందిస్తూ.. “బీజేపీ నేతలు తామే భారత ప్రజలమని అనుకుంటున్నారు. తామే సాయుధ దళాలని కూడా అనుకుంటున్నారు. మీరు భారత ప్రజలు కాదు, మీరు సాయుధ దళాలు కాదు. కాబట్టి మీరు ప్రజల వెనుక, సాయుధ దళాల వెనుక దాక్కోకూడదు” అని ఎద్దేవా చేశారు.
అధికార పక్షం నిరసనల మధ్య సాగిన తన ప్రసంగాన్ని ముగిస్తూ, అందరి కోసం ఒక “పజిల్” విసరాలనుకుంటున్నానని రాహుల్ చెప్పారు. “నిన్న ప్రధాని శక్తిహీనంగా కనిపించారు. అకస్మాత్తుగా నేను గమనించిందేమిటంటే.. నిన్న ఏప్రిల్16. ఈ పొడుపుకథకు సమాధానం అంతా 16లోనే ఉంది. ఎవరికైనా అర్థమైతే నాకు మెసేజ్ పంపండి” అని ఆయన అన్నారు. “16” దేనిని సూచిస్తుందో ఆయన వివరించలేదు, అయితే అది ఎప్‌స్టీన్ ఫైల్స్ కు సంబంధించినదేనని కాంగ్రెస్ తర్వాత ‘ఎక్స్’లో హింట్ ఇచ్చింది.
మోదీకి, నాకు ‘భార్య సమస్య’ లేదు
ప్రధాని మోదీకి, తనకు ‘భార్య సమస్య’ లేదని రాహుల్ గాంధీ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లోని మహిళల నుంచి ఎంతో నేర్చుకున్నారని ఆయన అన్నారు. ‘ఈ సభలో ఉన్న మనమందరం మన జీవితాల్లోని మహిళల నుంచి.. ముఖ్యంగా తల్లులు, సోదరీమణులు, భార్యల ప్రభావానికి లోనయ్యాం. వారి ద్వారా ఎంతో నేర్చుకున్నాం’ అని రాహుల్ చెప్పారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మాదిరిగా తన భార్య కోసం కవిత రాయనందుకు ఇంట్లో చివాట్లు తిన్నానని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సరదాగా చేసిన వ్యాఖ్యలను రాహుల్ ప్రస్తావించారు.
‘నిజమే.. ప్రధానికి, నాకు భార్య సమస్య లేదు. కాబట్టి మాకు ఆ చివాట్లు ఉండవు. కానీ, మాకు తల్లులు, సోదరీమణులు ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. గురువారం లోక్‌సభలో తన సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగాన్ని కూడా రాహుల్ ప్రశంసించారు. ‘నా 20 ఏండ్ల రాజకీయ జీవితంలో నేను చేయలేకపోయిన పనిని.. అంటే, అమిత్ షాజీ ముఖంలో చిరునవ్వును నిన్న నా సోదరి కేవలం ఐదు నిమిషాల్లోనే సాధించడం చూశాను’ అని అనడంతో సభలో నవ్వులు విరిశాయి.