Reading Time: 2 minutes

అమెరికా సైన్యంలో కొడుకు..ఇమ్మిగ్రేషన్ అధికారుల కస్టడీలో తల్లికి పస్తులు..24 గంటలు తిండి, నీళ్లు ఇవ్వలేదు

Caption of Image.

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ రూల్స్ కఠినతరం కావడంతో భారతీయులు పడుతున్న తిప్పలు మరోసారి వెలుగుచూశాయి. ముప్పై ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నా.. ఆమె కొడుకు అమెరికా సైన్యంలో ఆర్మీగా పనిచేస్తున్నా ఓ భారతీయ సంతతి మహిళకు ఇమ్మిగ్రేషన్ అధికారుల వేధింపులు తప్పలేదు. 20ఏళ్ల క్రితం ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ తో ఆ మహిళను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు  ఇమ్మిగ్రేషన్ అధికారులు. 

అమెరికాలో నివసిస్తున్న 53 ఏళ్ల భారత సంతతి మహిళ మీను బాత్రాను ఇమ్మిగ్రేషన్ అధికారులు (ICE) అరెస్ట్ చేశారు. బాత్రాపై దేశ బహిష్కరణ ఆదేశాలు ఉండటంతో ఆమె విస్కాన్సిన్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్  రూల్స్ కఠినతరం చేయడంతో పాత ఆదేశాల మేరకు ఆమెను దేశం నుంచి బహిష్కరించేందుకు అమెరికా అధికారులు సిద్దమయ్యారు. అయితే ఇమ్మిగ్రేషణ్ అధికారులు చెరలో ఉన్న బాత్రాను వేధింపులకు గురి చేశారని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. 24 గంటలుగా ఐసీఈ అధికారులు అదుపులో ఉన్న బాత్రాకు ఆహారం , తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 

35 ఏళ్లుగా అమెరికాలో నివాసం ఉంటున్న బాత్రాపై 2000 సంవత్సరం నాటి దేశ బహిష్కరణ ఆదేశాలున్నాయి.  మీను బాత్రా గత 20 ఏళ్లుగా ఇమ్మిగ్రేషన్ కోర్టులో పనిచేస్తున్నారు. పంజాబీ, హిందీ, ఉర్దూ భాషలను ఆంగ్లంలోకి ట్రాన్స్ లేట్ చేసే ఏకైక సర్టిఫైడ్ ఇంటర్‌ప్రెటర్‌గా ఆమె టెక్సాస్‌లో గుర్తింపు పొందారు. కొన్ని దశాబ్దాలుగా వేలాది మంది వలసదారులకు న్యాయపరమైన విషయాల్లో ఆమె తన అనువాద సేవల ద్వారా సహాయం చేస్తూ వస్తున్నారు.బాత్రా చిన్న కుమారుడు కొన్ని నెలల క్రితం యూఎస్ సైన్యంలో చేరి, ఆమె తరపున పెరోల్ దరఖాస్తు కూడా దాఖలు చేశారని టెక్సాస్ అబ్జర్వర్ తెలిపింది.  

►ALSO READ | బిటా హెమ్మతి ఎవరు ? ఈ ఇరాన్ మహిళకు కోర్ట్ మరణశిక్ష ఎందుకు వేసిందో తెలుసా ? ఏం జరిగిందంటే..

1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లలో తన తల్లిదండ్రులు చనిపోవడంతో 1980లలో భారత్ విడిచి  అమెరికాకు వలస వెళ్లారు మీను బాత్రా. బాత్రా హిందీ, పంజాబీ ,ఉర్దూ భాషలలో అక్కడి కోర్టులు సర్టిఫైడ్ చేసిన ట్రాన్స్ లేటర్.  2007 నుంచి దాదాపు ఇరవైఏళ్లుగా అమెరికాలో భాషా సేవలను అందిస్తున్నారని టెక్సాస్ లో ప్రముఖ భాషా సేవల సంస్థ ఇండస్ లింగో తెలిపింది.

మార్చి 17న మీను బాత్రా ఇమ్మిగ్రేషన్ కోర్టు పని నిమిత్తం విస్కాన్సిన్‌లోని మిల్వాకీకి ప్రయాణిస్తుండగా టెక్సాస్‌లోని వ్యాలీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో  ICE అధికారులు అదుపులోకి తీసుకున్నారు. యూఎస్-మెక్సికో సరిహద్దులోని రేమండ్‌విల్లేలో నిర్బంధ కేంద్రంలో ఉంచారు. ఇంకా కస్టడీలోనే ఉంది.

బాత్రా అరెస్ట్ పై యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు ఆమె తరపు న్యాయవాదులు. బాత్రా ఇమ్మిగ్రేషన్ అటార్నీల పిటిషన్ ప్రకారం.. ఆమెకు దాదాపు 24 గంటల పాటు ఆహారం , నీరు లేకుండా నిర్భంధించారని వాదించారు. బాత్రా శ్వాసకోశ వ్యాధితో బాధపడిందని, గొంతు కూడా కోల్పోయిందని ఆమె న్యాయవాదులు చెప్పారు.  బాత్రాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.