Reading Time: 2 minutes

అదరగొట్టిన ప్రభ్‌సిమ్రాన్, శ్రేయస్.. ముంబైపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం

Caption of Image.

MI vs PBKS: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో పంజాబ్ కింగ్స్ (PBKS) జైత్రయాత్ర కొనసాగింది. ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడిన పంజాబ్, 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ (MI) ను మట్టికరిపించింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

డికాక్ సెంచరీ వృథా: 
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన సెంచరీతో (112 పరుగులు) చెలరేగాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అయితే ముంబై బౌలర్లు ఈ భారీ స్కోరును కాపాడుకోవడంలో విఫలమయ్యారు.

శ్రేయస్, ప్రభ్‌సిమ్రాన్ కిరాక్ బ్యాటింగ్: 
196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే ప్రియాంష్ ఆర్య (15) వికెట్ కోల్పోయి షాక్ తగిలింది. ఆ తర్వాత వచ్చిన కూపర్ కున్నోలీ (17) రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కానీ వీరిద్దరినీ ముంబై బౌలర్ ఏ.ఎం. ఘజన్‌ఫర్ అవుట్ చేసి మ్యాచ్‌ను రక్తి కట్టించాడు. అయితే, ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబై ఆశలపై నీళ్లు చల్లారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్, ఈ సీజన్‌లో తన మూడో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శార్దుల్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో హోరెత్తించిన అయ్యర్, 66 రన్స్ చేసిన తర్వాత అవుట్ అయ్యాడు.

ఇక మ్యాచ్ మొత్తానికి హైలైట్ ప్రభ్‌సిమ్రాన్ బ్యాటింగ్! ఆరంభం నుంచి చివరి వరకు క్రీజులో పాతుకుపోయి, ముంబై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ప్రభ్‌సిమ్రాన్ (80) అద్భుతమైన హాఫ్ సెంచరీతో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్లలో ఏ.ఎం. ఘజన్‌ఫర్ 2 వికెట్లు, శార్దుల్ ఠాకూర్ ఒక వికెట్ తీసుకోగా, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా భారీగా పరుగులు సమర్పించుకోవడం ముంబై ఘోర ఓటమిని మూటగట్టుకుంది.  

©️ VIL Media Pvt Ltd.