
నిజామాబాద్ మార్కెట్ యార్డుపై పసుపు రైతులు దాడికి దిగారు. బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేస్తూ పసుపు ధర తగ్గిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ లో ఒక ధర ఉంటే.. ఆఫ్ లైన్ ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ అధికారుల తీరుపై మండిపడ్డ రైతులు.. ఆఫీస్ పై దాడి చేశారు. మార్కెట్ అధికారులను ఘెరావ్ చేశారు. కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేశారు. మార్కెట్ లో బహిరంగవేలం ద్వారా జరుగుతున్న కొనుగోళ్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
బుధవారం(ఏప్రిల్15) నిజామాబాద్ మార్కెట్ యార్డుకు భారీగా పసుపు అమ్మకానికి వచ్చింది. దాదాపు 50 వేల బస్తాల పసుపును రైతులు మార్కెట్ కు తీసుకొచ్చారు. ఆన్ లైన్ లో క్వింటాల్ పసుపు ధర రూ 16వేలు ఉండగా.. బహిరంగ వేలం ద్వారా క్వింటాల్ పసుపును మూడు వేలు తగ్గించి రూ. 13వేలకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆఫ్ లైన్ కొనుగోళ్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.