Reading Time: 2 minutes

సంతోషంగా లేకపోతే ఆఫీసుకు రావొద్దు: 10 రోజులు పెయిడ్ లీవ్స్ ఇస్తున్న కంపెనీ.. ఎక్కడంటే?

Caption of Image.

చైనా రిటైలర్ పాంగ్ డాంగ్ లై ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న ప్రత్యేకమైన ‘అన్‌హ్యాపీ లీవ్’ పాలసీ ఇప్పుడు భారత కార్పొరేట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఉద్యోగి మానసికంగా సంతోషంగా లేకపోతే.. ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్, ఫ్యామిలీ ఎమర్జెన్సీ పరిస్థితి, సుదీర్ఘ వివరణ అవసరం లేకుండానే సెలవు తీసుకోవచ్చు. ఏడాదికి అదనంగా 10 రోజుల వరకు ఈ పెయిడ్ లీవ్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఉద్యోగి కోరితే మేనేజర్ ఆ సెలవును తిరస్కరించకూడదన్నది చైనాలోని ఆ కంపెనీ రూల్.

ఈ విధానాన్ని 2024లో పాంగ్ డాంగ్ లై వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యు డాంగ్ లై తీసుకొచ్చారు. “ప్రతి ఒక్కరికీ కొన్ని సందర్భాల్లో సంతోషంగా లేని రోజులు ఉంటాయి. సంతోషంగా లేకపోతే పనికి రావద్దు” అనేది ఆయన ఆలోచన. ఉద్యోగి తన పరిస్థితిని మేనేజర్‌కు నిరూపించాల్సిన అవసరం లేకుండా.. తనకు పని నుంచి బ్రేక్ అవసరమని భావిస్తే సెలవు తీసుకోవచ్చని స్పష్టం చేశారు యు డాంగ్ లై. మేనేజ్‌మెంట్ ఈ సెలవును నిరాకరిస్తే అది నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని కూడా తెలిపారు.

ఈ పాలసీపై వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియా వేదిక Xలో చర్చకు తెరతీశారు. భారతదేశంలో కూడా ఇలాంటి ‘అన్‌హ్యాపీ లీవ్’ అవసరమా? లేక ఉద్యోగుల్లో బర్నౌట్‌ను తగ్గించి, వారు సంతోషంగా పని చేయాలనుకునే వాతావరణం కోసం మరేదైనా మెరుగైన మార్గం ఉందా? అని ప్రశ్నించారు. దీంతో ఉద్యోగుల మెంటల్ హెల్త్, పని ఒత్తిడి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

కొంతమంది ఉద్యోగికి వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా పనిపై ప్రభావం చూపుతాయని, అలాంటి సమయంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం ఉద్యోగి, సంస్థ ఇద్దరికీ మంచిదని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం 10 రోజుల అదనపు సెలవుతో సమస్య పరిష్కారం కాదని అన్నారు. ఏడాది పొడవునా అధిక పని గంటలు, అనవసర ఒత్తిడి, ఉద్యోగుల సమయాన్ని గౌరవించని మేనేజర్లను మార్చకుండా ‘అన్‌హ్యాపీ లీవ్’ ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని మరికొందరు నెటిజన్లు అంటున్నారు.

ALSO READ : ఈ20 పెట్రోల్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు

Pang Dong Laiలో ఉద్యోగుల సంక్షేమానికి ఈ ఒక్క పాలసీ మాత్రమే పరిమితం కాలేదు. ఉద్యోగులు రోజుకు 7 గంటలు మాత్రమే పనిచేస్తారు. వారాంతాల్లో సెలవులు ఉంటాయి. ఏడాదికి 30 నుంచి 40 రోజుల వరకు వార్షిక సెలవులు, లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా అదనంగా 5 రోజుల సెలవు కూడా అందిస్తోంది కంపెనీ. దీంతో ‘అన్‌హ్యాపీ లీవ్’ కంటే ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించే మొత్తం వర్క్ కల్చర్ ముఖ్యమన్న చర్చ మొదలైంది. భారత్‌లోనూ ఇలాంటి పాలసీ రావాలా లేక మెరుగైన వర్క్ కల్చర్‌నే ముందుగా తీసుకురావాలా అన్నది ఇప్పుడు ప్రశ్న. అయితే కొందరు మాత్రం చైనాలో లాంటి ఓనర్స్ ఇండియాలో దొరకటం కష్టమే అని నెట్టింట అభిప్రాయపడుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.