
North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గత రెండు నెలలుగా బహిరంగంగా కనిపించకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా క్షిపణి ప్రయోగాలు, ప్రభుత్వ పథకాల ప్రారంభం, ఫ్యాక్టరీల ప్రారంభ కార్యక్రమాల్లో కనిపించే కిమ్, గత కొంత కాలంగా కనిపించడం లేదు. ఉత్తర కొరియాలో గత కొద్ది కాలంగా కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు లేవు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. ఆయన ఎక్కడికి వెళ్లారు.? ఏమైంది.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
జాడ లేని కిమ్:
డైలీ స్టార్ నివేదిక ప్రకారం, చివరిసాగారి కిమ్ జూన్ 09న బహిరంగంగా కనిపించినట్లు సమాచారం. చైనా నుంచి వచ్చిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఉత్తర కొరియాలో చిన్న కార్యక్రమాల నుంచి పెద్ద భవనాలు, ఫ్యాక్టరీల ఓపెనింగ్ వంటి కార్యక్రమాలకు కిమ్ తప్పకుండా హాజరవుతారు. అక్కడి మీడియా వీటికి పెద్ద ప్రచారం కల్పిస్తుంది. ఇటీవల పలు కార్యక్రమాల్లో కిమ్‌కి బదులుగా ఉన్నతాధికారులు కనిపించారు.
ఇటీవల రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కిమ్ జోంగ్ థే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమం జరిగింది. నాంఫోలో పిల్లల కోసం నిర్మించిన స్కూల్ చిల్డ్రన్ ప్యాలెస్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ రెండు కార్యక్రమాలకు ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు. లోకోమోటివ్ కార్యక్రమానికి ప్రధాని పాక్ థే సాంగ్ హాజరయ్యారు. కేవలం బహిరంగ సమావేశాలే కాకుండా, ఇంటర్నల్ మీటింగ్స్‌లో కూడా ఆయన జాడ లేదు.
వాతావరణమే కారణమా?
కిమ్ ఎందుకు కనిపించడం లేదనే దానిపై క్లారిటీ లేదు. కానీ కొంత మంది మాత్రం వాతావరణాన్ని ప్రస్తావిస్తున్నారు. ఉత్తర కొరియాలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు చేరినట్లు సమాచారం. అధిక తేమ ఉంటంతో కిమ్ ఆరోగ్యం, విశ్రాంతి కారణాల వల్ల బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. అయితే, గతంలో ఇలాంటి వేడి వాతావరణంలో కూడా కిమ్ బయటకు వచ్చే వారిని పలువురు విశ్లేషిస్తున్నారు.
చనిపోయాడంటూ ఊహాగానాలు:
కిమ్ దీర్ఘకాలంగా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో వదంతులు పెరుగుతున్నాయి. అతడి ఆరోగ్యం దెబ్బతిందని కొందరు చెబుతుంటే, మరికొందరు కిమ్ చనిపోయాడంటూ కొత్త వాదనలు తీసుకొస్తున్నారు. కిమ్ స్థానంలో ‘‘బాడీ డబుల్’’ ఉపయోగిస్తు్న్నారనే వాదన కూడా ఉంది.