Reading Time: 2 minutes

హనీట్రాప్‌లో చిక్కిన IAF కమాండర్..చాటింగ్, వీడియో కాల్స్ లో డిఫెన్స్ రహస్యాలు లీక్ చేసినందుకు అరెస్ట్!

Caption of Image.

సోషల్ మీడియాలో ఒక మహిళ వలలో చిక్కి,  డిఫెన్స్ రహస్యాలను లీక్ చేశారన్న ఆరోపణలతో భారత వైమానిక దళానికి (IAF) చెందిన   వింగ్ కమాండర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

ఎలా దొరికాడు.. అసలు ఏం జరిగిందంటే..  
నిందితుడైన వింగ్ కమాండర్ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, సోషల్ మీడియా ద్వారా ఒక మహిళ హనీట్రాప్ వలవేసి అతనికి పరిచయమైంది. మొదట్లో చాటింగ్‌లు, వీడియో కాల్స్‌తో ప్రారంభమైన వీరి పరిచయం మెల్లిగా నమ్మకంగా మారింది. తరువాత ఆ మహిళ అతన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది.

సైనిక దళాల కదలికలు, బలగాల మోహరింపులు, ఇతర సున్నితమైన సమాచారాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో తనకు పంపాలని ఆ మహిళ కోరింది. ఆమె మాటలు నమ్మిన ఆ అధికారి డిజిటల్ మాధ్యమాల ద్వారా చాలా ముఖ్యమైన పేపర్స్, రహస్యాలను లీక్ చేస్తూ  ఆమెకు చేరవేశాడు. 

స్పైవేర్  ప్లాన్:
కేవలం రహస్యాలు తీసుకోవడంతో ఆగకుండా, ఆ మహిళ ఆ వింగ్ కమాండర్‌పై మరింత ఒత్తిడి తెచ్చింది. అతని సహోద్యోగి ఫోన్‌లో ఒక ప్రత్యేకమైన యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని కోరింది. ఈ యాప్ సాధారణంగా ఫోన్ డేటాను దొంగిలించడానికి, లొకేషన్‌ను ట్రాక్ చేయడానికి లేదా కాల్స్‌ను ట్యాప్ చేయడానికి వాడే ఒక ప్రమాదకరమైన స్పైవేర్ కావొచ్చు లేదా రిమోట్-యాక్సెస్ మాల్‌వేర్ కావొచ్చని పోలీసులు తేల్చారు. ఆ అధికారి తన సహోద్యోగి ఫోన్‌లో కూడా ఆ సీక్రెట్ యాప్‌ను ఇన్స్టాల్ చేసినట్లు గుర్తించారు.

పాకిస్తాన్ లింక్ 
ఈ హనీట్రాప్ వెనుక పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సోషల్ మీడియా ద్వారా అధికారిని ట్రాప్ చేసిన మహిళ, పాకిస్తాన్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే ఈ పనంతా నడిపించిందని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.

ALSO READ : మెస్సీ హత్యకు కుట్ర.. ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుండగా బాంబు దాడికి ప్లాన్

ఎలా బయటపడిందంటే 
ఈ వింగ్ కమాండర్ కదలికలపై ముందే అనుమానం వచ్చిన ఐఏఎఫ్ (IAF) నిఘా విభాగం ఇతనిపై కన్నేసింది. పూర్తి సమాచారాన్ని సేకరించి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, మే 31 రాత్రే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడికి, ఆ మహిళకు మధ్య జరిగిన చాటింగ్స్, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

©️ VIL Media Pvt Ltd.