
హైదరాబాద్: బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఆగస్టు 9, 10న పాతబస్తీలో భారీ ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని.. వాహనదారులు గమనించాలని పోలీసులు సూచించారు.
మదీనా ఎక్స్ రోడ్స్ నుంచి ఇంజిన్ బౌలి వరకు ప్రధాన రహదారి పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపారు. దర్బార్ మైసమ్మ బోనాల సందర్భంగా కార్వాన్‌లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని.. ఆగస్ట్ 8వ తేదీ రాత్రి నుంచి ఆగస్ట్ 10వ తేదీ ఉదయం వరకు.. మహంకాళి ఆలయం, అంబర్‌పేట్ దగ్గర ఆగస్ట్ 9 ఉదయం నుంచి ఆగస్ట్ 10 మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
* చిలకలగూడ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయం వద్ద 2 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు
* పాతబస్తీ వైపు వెళ్లే RTC బస్సులు, భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు
* భక్తుల కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
* వాహనదారులు ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసుల సూచన
* ట్రాఫిక్ అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్: 9010203626
తెలంగాణ గ్రామ దేవతలైన మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మలకు మహిళలు భక్తిశ్రద్ధలతో సమర్పించే నైవేద్యాన్నే బోనం అంటారు. ఆషాఢ మాసంలో మహిళలు కొత్త మట్టి లేదా రాగి పాత్రలో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో బోనం తయారు చేస్తారు. ఆ పాత్రను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి, పైభాగంలో దీపం వెలిగించి తలపై మోసుకుంటూ డప్పుల మోత, పోతరాజుల నృత్యాల మధ్య ఆలయాలకు ఊరేగింపుగా వెళ్తారు. అమ్మవారికి బోనం సమర్పించి పట్టు వస్త్రాలు, సారె అర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు.