Reading Time: < 1 minute
Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా..

టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి భారీ చోరీ కలకలం రేపింది. అన్నమయ్య సర్కిల్‌లో ఉన్న సోనోవిజన్‌ మొబైల్‌ షాపులోకి అర్ధరాత్రి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు అందినకాడికి దోచుకెళ్లారు. షోరూం గోడకు భారీ రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన కేటుగాళ్లు.. షాపులో ఉన్న మొబైల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకెళ్లారు. ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన యజమాని.. గోడకున్న రంధ్రం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా, ర్యాక్‌లలో ఉండాల్సిన ఫోన్‌లు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

రైడ్ నిర్వహించి వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి 1:39 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. షోరూమ్‌లో ఎంత స్టాక్ ఉంది? నిన్న రాత్రి క్లోజ్ చేసిన సమయానికి సేల్స్ ఎంత, స్టాక్ ఎంత ఉంది? అనే లెక్కలు తీసే పనిలో పడ్డ క్రైమ్ పోలీసులు, అసలు దొంగలు ఎవరో తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

కాగా, సుమారు 50 ఆపిల్ ఫోన్లతో పాటు ఇతర కంపెనీలకు చెందిన మరో 200 మొబైల్‌ ఫోన్లు, పలు ఎలక్ట్రానిక్‌ వస్తువులు చోరీకి గురైనట్లు షోరూమ్ యాజమాన్యం తెలిపింది. చోరీకి గురైన ఫోన్ల విలువ సుమారు రూ. 2 కోట్ల మేర ఉంటుందని, ఎలాగైనా నిందితులను పట్టుకోవాలని యాజమాన్యం పోలీసులను కోరింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.