Reading Time: < 1 minute

నేతన్నలకు చేతినిండా పని కల్పిస్తున్నాం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Caption of Image.
  • సిరిసిల్లలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం 

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  నేతన్నలకు చేతినిండా పని కల్పించి, వారి ఆర్థిక పరిస్థితిని  మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టర్​గరిమ అగ్రవాల్​తో కలిసి సిరిసిల్లలోని నేతన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్లలోని నేతన్నలు, కార్మికులు, ఆసాములు, యజమానులకు ఏడాదిలో సుమారు 8 నెలల పాటు పని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గతేడాది రూ.6.70  కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చామని, ఈ ఏడాది ఇప్పటివరకు 4.50 కోట్ల ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు.

నేతన్నల బీమా పథకం ద్వారా సిరిసిల్లలో 129 మందికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, ఆర్డీవో శ్రీధర్ బాబు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్​టైల్స్ ఏడీ సంతోష్, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ప్రోత్సహిద్దాం 

కరీంనగర్ టౌన్, వెలుగు: మన సంప్రదాయానికి ప్రతీక అయిన చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ప్రోత్సహిద్దామని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. కలెక్టరేట్​లో నిర్వహించిన చేనేత దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. పచ్చనూరు చేనేత క్లస్టర్ తయారు చేసిన చీరను ఆవిష్కరించారు.

టెస్కో కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలతో కూడిన ప్రత్యేక స్టాల్​ను ఏర్పాటు చేయగా పరిశీలించారు. అంతకుముందు చేనేతకు మద్దతుగా ర్యాలీ తీశారు. చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, మాజీ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.