
- బేగంపేటలో ప్రారంభించిన సదరన్ డిస్కమ్ సీఎండీ జితేష్ వి.పాటిల్
హైదరాబాద్, వెలుగు: సదరన్ డిస్కమ్ పరిధిలో విద్యుత్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ‘బస్తీబాట’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 సర్కిళ్లలో శుక్రవారం సంస్థ సీఎండీ జితేష్ వి. పాటిల్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బేగంపేటలో ఆయన స్వయంగా పర్యటించి వినియోగదారులను కలిసి విద్యుత్ సమస్యలను తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వేగవంతమైన, పారదర్శక సేవలందించడమే బస్తీబాట లక్ష్యమని తెలిపారు.
క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటనలు..
చీఫ్, సూపరింటెండింగ్, డివిజనల్, అసిస్టెంట్ డివిజనల్, అసిస్టెంట్ ఇంజినీర్లు, లైన్‌మెన్లు, ఆర్టిజన్లు తదితర సిబ్బంది బస్తీలు, కాలనీలు, గ్రామాలు, తండాలు, పట్టణాల్లో పర్యటించి వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించారు. సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించారు. పంపిణీ వ్యవస్థ బలోపేతంలో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్ల పరిశీలన, సబ్‌స్టేషన్ల పరిశుభ్రత, చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ తీగల బిగింపు, దెబ్బతిన్న కండక్టర్లు, స్తంభాల మార్పిడి వంటి పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.
యూనిఫాం సర్వీస్ లైన్ చార్జీలపై శిక్షణ..
కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరును సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫాం సర్వీస్ లైన్ చార్జీల అమలుపై యూసఫ్‌గూడలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఇందులో సదరన్ డిస్కమ్ పరిధిలోని 21 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నిర్ణీత గడువులో దరఖాస్తులను పరిష్కరించి, నాణ్యమైన, పారదర్శక సేవలు అందించాలని అధికారులకు సీఎండీ జితేష్ వి. పాటిల్ సూచించారు.