Reading Time: 2 minutes
దిగ్గజ ఫుట్‌బాలర్ మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ఇంటర్ మయామి స్టార్ లియోనెల్ మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ 68 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జార్జ్.. అర్జెంటీనాలోని రొసారియోలోని ఓ వైద్య కేంద్రంలో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. జార్జ్ మెస్సీ ఆరోగ్య పరిస్థితిపై గత కొన్ని నెలలుగా వార్తలు వెలువడుతున్నాయి. 2026 జూన్‌లో మెస్సీ కుటుంబం ఆయన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి మెరుగుపడుతోందని అప్పట్లో కుటుంబం తెలిపింది. అదే సమయంలో జార్జ్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులు, ఊహాగానాలపై కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

జూన్‌లో అల్జీరియాపై గోల్ చేసిన తర్వాత లియోనెల్ మెస్సీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. గోల్ అనంతరం అతని కళ్లలో కన్నీళ్లు కనిపించడంతో కారణం ఏమిటని మీడియా ప్రశ్నించింది. అప్పట్లో మెస్సీ తన భావోద్వేగానికి ఫుట్‌బాల్‌తో సంబంధం లేదని, కొన్ని రోజులుగా వ్యక్తిగతంగా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నానని చెప్పాడు. ఆ వ్యాఖ్యల తర్వాత ఆయన తండ్రి ఆరోగ్యంపై ఊహాగానాలు మరింత పెరిగాయి. లియోనెల్ మెస్సీ ఫుట్‌బాల్ ప్రయాణంలో జార్జ్ కీలక పాత్ర పోషించారు. చిన్నతనంలోనే కుమారుడి ప్రతిభను గుర్తించిన ఆయన.. మెస్సీ ప్రారంభ ఫుట్‌బాల్ ప్రయాణంలో కోచ్‌గా కూడా వ్యవహరించారు. మెస్సీ 14 ఏళ్ల వయసు నుంచి అతని ఏజెంట్‌గా కూడా జార్జ్ వ్యవహరించారు. కుమారుడి కెరీర్‌కు సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఆయన నిరంతరం తోడుగా నిలిచారు.