Reading Time: < 1 minute
Miapur Balloon Gas Cylinder Blast

Balloon Gas Cylinder Blast: హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం వేళ తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. స్థానిక జీఎస్‌ఎం (GSM) మాల్ ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డుపై వ్యాపారి బెలూన్లలో గ్యాస్ నింపుతుండగా, సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదం తీవ్ర కలకలం సృష్టించగా, ఘటనా స్థలంలో ఉన్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితుల్లో ఐస్‌క్రీమ్ వ్యాపారి వివేక్ పాల్ (19)కు తీవ్ర గాయాలు కాగా, శ్రీ చైతన్య కళాశాల విద్యార్థిని నంద్యాల ధనుష (16), ఐటీ ఉద్యోగిని విన్నకోట సింధు ప్రియా (25) , ముళ్లగాని జనార్ధన్‌లకు స్వల్ప గాయాలయ్యాయి.

రంగంలోకి దిగిన పోలీసులు.. వ్యాపారిపై కేసు నమోదు

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బెలూన్లలో గ్యాస్ నింపే సిలిండర్‌ను సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా, అత్యంత నిర్లక్ష్యంగా నిర్వహించడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన బెలూన్ వ్యాపారి జయరామ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.