
దేశంలోని ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన లాభాలతో కూడా రికార్డులు సృష్టిస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్ జూన్ మధ్య) అంటే 90 రోజుల్లో రూ.21వేల 121 కోట్లు లాభాన్ని సంపాదించింది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ నికర లాభం రూ.19వేల 160 కోట్ల నుంచి 10 శాతం ప్రస్తుతం పెరగటం గమనార్హం. దేశంలోని ప్రైవేటు బ్యాంకులు కూడా ఈ స్థాయిలో లాభాలను అందుకోవటానికి కష్టపడుతున్నాయి.
జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగి రూ.46వేల 992 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.40వేల 907 కోట్లుగా ఉంది. ప్రీ-ప్రొవిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.33వేల 530 కోట్లకు చేరింది. వాస్తవానికి కంపెనీ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను బీట్ చేయటం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కూడా కురిపిస్తోంది.
బ్యాంక్ అసెట్ క్వాలిటీలో కూడా మెరుగుదల కనిపించింది. స్థూల ఎన్‌పీఏలు 1.49 శాతం నుంచి 1.47 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.39 శాతం నుంచి 0.38 శాతానికి తగ్గాయి. అయితే స్లిప్పేజీలు రూ.5వేల 548 కోట్ల నుంచి రూ.7వేల 359 కోట్లకు పెరిగాయి. దేశీయ నికర వడ్డీ మార్జిన్(NIM) 3 శాతంగా నమోదైంది. మొత్తం బ్యాంక్ NIM 5 బేసిస్ పాయింట్లు పెరిగి 2.86 శాతానికి చేరింది. స్థూల రుణాలు 18.6 శాతం పెరగగా.. మొత్తం డిపాజిట్లు 9.73 శాతం వృద్ధితో రూ.60లక్షల 6వేల కోట్లకు చేరాయి.
రిటైల్, కార్పొరేట్, ఎస్‌ఎంఈ, అగ్రి లోన్స్ లోనూ బలమైన వృద్ధిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నమోదు చేసింది. బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.110 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం ఎస్‌బీఐ ఆర్థిక బలాన్ని సూచిస్తోంది.