Reading Time: < 1 minute
Yogi Adityanath Pm Modi Meeting Up Elections 2027

Modi-Yogi Meeting: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీలో కలిశారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. యూపీలో ఎన్నికల సన్నాహాలు, ప్రభుత్వ పనితీరు, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా యోగితో భేటీ కానున్నారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తి నెలకొంది.

2027 మొదట్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వరసగా రెండుసార్లు అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు 2029 లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. దేశవ్యాప్తంగా యూపీలోనే అత్యధిక లోక్‌సభ ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న పార్టీనే జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుందనేది నిజం. అందుకే ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహరచన చేస్తోంది.