Reading Time: 2 minutes
Team India: బుమ్రా, హార్దిక్, సుందర్.. గాయాల బారిన పడిన 13 మంది టీమిండియా స్టార్లు వీరే

Team India: భారత క్రికెట్ జట్టు బిజీ షెడ్యూల్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ మళ్లీ పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో ఉన్న దాదాపు 13 మంది కీలక ఆటగాళ్లు ప్రస్తుతం వివిధ రకాల గాయాలతో బాధపడుతూ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో రీహాబిలిటేషన్ పొందుతున్నారు. బీసీసీఐ మెడికల్ టీమ్ వీరందరినీ త్వరగా కోలుకునేలా చేయడానికి అహోరాత్రులు శ్రమిస్తోంది. శ్రీలంక పర్యటన, రాబోయే సిరీస్‌ల ముంగిట ఇది భారత క్రికెట్‌ యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.

CoE లో చికిత్స పొందుతున్న స్టార్ ప్లేయర్లు

జస్ప్రీత్ బుమ్రా: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే తర్వాత ఎడమ మోకాలి నొప్పితో బాధపడుతున్న బుమ్రా జూలై 30న CoEలో చేరారు. ఈ గాయం కారణంగా ఆయన శ్రీలంక టెస్టు సిరీస్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్‌పై దృష్టి సారించారు.

హార్దిక్ పాండ్యా: ఎడమ తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో, ఆయన కుడి పిక్క ఎముక భాగంలో నెప్పి బాధిస్తోంది. ప్రస్తుతం ముందస్తు జాగ్రత్తగా రన్నింగ్ పునఃప్రారంభించారు.

నితీష్ కుమార్ రెడ్డి: ఎడమ తొడ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం రిటర్న్ టు స్కిల్స్ దశకు చేరుకుని ప్రాక్టీస్ నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నారు.

సాయి సుదర్శన్: కాలి బొటనవేలి గాయంతో బాధపడుతున్న సాయి సుదర్శన్ నెట్స్‌లో బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ ప్రారంభించారు. త్వరలోనే ఎంఆర్‌ఐ స్కానింగ్ ద్వారా తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

హర్షిత్ రాణా: కుడి హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్న రాణా బాడీ వెయిట్ మేనేజ్‌మెంట్, కోలుకునే ప్రక్రియలో పురోగతి సాధిస్తున్నారు.

వాషింగ్టన్ సుందర్: రైట్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం వల్ల ప్రస్తుతం CoE లో ఉన్నారు. ఇప్పటికే జోగింగ్, కండిషనింగ్ ఎక్సర్సైజులు ప్రారంభించారు.

వరుణ్ చక్రవర్తి: లెఫ్ట్ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో స్పాట్ బౌలింగ్ చేస్తున్నారు. త్వరలోనే బ్యాటర్లకు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

యువ బౌలర్లు, ఇతర ఆటగాళ్ల గాయాల వివరాలు:

ఆకాశ్ దీప్: వీపు కింది భాగంలో స్ట్రెస్ ఫ్రాక్చర్ నుంచి కోలుకుని రిటర్న్ టు ప్లే ప్రోగ్రామ్‌లో భాగమయ్యారు.

హిమాంశు సింగ్: కుడి మోకాలి గాయంతో బాధపడుతున్న ముంబై పేసర్, జూలై 28 నుంచి స్పాట్ బౌలింగ్ ప్రారంభించారు.

అశోక్ శర్మ: 13 మందిలో అత్యంత తీవ్రంగా గాయపడింది ఈయనే. వీపు కింది భాగంలో, ఎడమ 11వ పక్కటెముకలో ఫ్రాక్చర్ అయింది. న్యూజిలాండ్ స్పైన్ స్పెషలిస్ట్ సలహాలు తీసుకుంటున్నారు.

సుయాష్ శర్మ: రెండు మోకాళ్లలో పటెల్లార్ ఇన్సర్షనల్ టెండినోపతి కారణంగా పిఆర్‌పి ఇంజెక్షన్ తీసుకుని ప్రత్యేక రీహాబ్‌లో ఉన్నారు.

యుధ్వీర్ సింగ్: కుడి భుజం నొప్పితో బాధపడుతూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ పొందుతున్నారు.

రియాన్ పరాగ్: కుడి భుజం సర్జరీ తర్వాత కోలుకుంటూ కండిషనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..