Reading Time: < 1 minute
Vijaya Dairy Chairman Post Tdp Defers Selection Amid Mla Proposals

Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ పదవి ఇప్పుడు టీడీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఛైర్మన్ పదవిని తమ వారికి ఇవ్వాలంటూ పలువురు ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు చేయడంతో పార్టీలో పోటీ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చలసాని రాజీనామా వ్యవహారంతో విజయ డైరీ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తాజాగా ఛైర్మన్ ఎంపిక విషయంలోనూ కొత్త రచ్చ మొదలైంది.

విజయ డైరీ ఛైర్మన్ పదవి కోసం పలువురు పేర్లను ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు సమాచారం. పాలడుగు నానికి ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అలాగే అర్జా నగేష్ పేరును ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సూచించినట్లు సమాచారం. మరోవైపు డైరెక్టర్‌గా ఉన్న చక్రవర్తికి ఛైర్మన్ పదవి ఇవ్వాలని మరో ఎమ్మెల్యే ప్రతిపాదించగా, మరో మహిళా డైరెక్టర్‌కు అవకాశం కల్పించాలని ఇంకో ఎమ్మెల్యే సూచించినట్లు తెలుస్తోంది.

ఇలా ఒకే పదవి కోసం పలువురు పేర్లు తెరపైకి రావడంతో విజయ డైరీ ఛైర్మన్ ఎంపిక వ్యవహారం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చలసాని రాజీనామాతో విజయ డైరీ విషయంలో పార్టీలో రచ్చ జరిగిందని భావిస్తున్న అధిష్టానం.. మరోసారి విభేదాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త ఛైర్మన్ ఎంపికను వారం రోజుల పాటు వాయిదా వేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎలాంటి విభేదాలు, వివాదాలు లేకుండా ఛైర్మన్ ఎంపిక ఏకగ్రీవంగా జరిగేలా చూడాలని మంత్రి కొల్లు రవీంద్రకు అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

పలువురు ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన పేర్లను ప్రతిపాదించిన నేపథ్యంలో.. అందరినీ సమన్వయం చేసి ఏకాభిప్రాయం తీసుకురావడంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో వారం రోజుల తర్వాత విజయ డైరీ కొత్త ఛైర్మన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై విజయవాడ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.