
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు యూఎస్ సెనేట్ షాకిచ్చింది. అధ్యక్షుడి యుద్ధ ప్రాతిపాదనలను పక్కనపెట్టింది. దీంతో ట్రంప్‌కు భారీ ఝలక్ తగిలినట్లైంది. అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోకుండా చేసేందుకు ఉద్దేశించిన తాత్కాలిక ఖర్చుల బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపింది. అయితే ఇరాన్‌తో యుద్ధానికి అదనంగా 70 బిలియన్ డాలర్ల అత్యవసర నిధులు కేటాయించాలన్న ట్రంప్ డిమాండ్‌ను మాత్రం సెనేట్ పక్కనపెట్టింది. అలాగే వివాదాస్పద ఓటరు గుర్తింపు నిబంధనలకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా బిల్లులో చేర్చేందుకు నిరాకరించింది.
సెనేట్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 90 మంది సభ్యులు ఓటు వేయగా.. ఆరుగురు వ్యతిరేకించారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి డిసెంబర్ 11 వరకు అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రభుత్వ షట్‌డౌన్‌ను నివారించేందుకు ఇది కీలక ముందడుగు అని సెనేట్ అప్రోప్రియేషన్స్ కమిటీ చైర్ సుసాన్ కాలిన్స్ పేర్కొన్నారు.
ఇరాన్ యుద్ధానికి సంబంధించి సుమారు 70 బిలియన్ డాలర్ల అదనపు నిధులను ప్రత్యేకంగా ఆమోదించాలని వైట్‌హౌస్ సెనేట్‌పై ఒత్తిడి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనను ప్రస్తుత తాత్కాలిక ఖర్చుల బిల్లులో చేర్చేందుకు సెనేటర్లు అంగీకరించలేదు. అలాగే రిపబ్లికన్ నేతలు మద్దతిస్తున్న కొత్త ఓటింగ్ ఆంక్షలను కూడా బిల్లులో చేర్చలేదు. ఈ ఓటింగ్ పరిమితులను ఆమోదించేందుకు అవసరమైన సంఖ్యాబలం తమ దగ్గర లేదని రిపబ్లికన్ నేతలు ఇప్పటికే పేర్కొన్నారు. దీంతో ట్రంప్ కోరిన కీలక అంశాలు బిల్లులో చోటు చేసుకోలేదు.
సెనేట్ ఆమోదించిన ఈ తాత్కాలిక ఖర్చుల బిల్లు ఇప్పుడు ప్రతినిధుల సభకు వెళ్లనుంది. ఆగస్టు 31న కాంగ్రెస్ సభ్యులు తిరిగి సమావేశమైన తర్వాత ఈ బిల్లును హౌస్‌లో ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది. అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వం నిధుల కొరతతో కార్యకలాపాలు నిలిపివేయకుండా ఉండేందుకు ఈ బిల్లును త్వరగా ఆమోదించాల్సిన అవసరం ఉంది.
కొత్త హ్యాంప్ నిబంధనల అమలును ఒక నెల పాటు వాయిదా వేయాలన్న వైట్‌హౌస్ ప్రతిపాదనను కూడా సెనేట్ చివరకు తొలగించింది. తక్కువ మోతాదులో మత్తు కలిగించే గంజాయి రసాయనాలు ఉండే హ్యాంప్ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలకు ఈ వాయిదా ఉపయోగపడేది. అయితే కొందరు సంప్రదాయవాద రిపబ్లికన్ సెనేటర్లు దీనిని వ్యతిరేకించడంతో ప్రతిపాదనను బిల్లు నుంచి తొలగించారు.
వైట్‌హౌస్ నిబంధనల ద్వారా రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చే రాష్ట్రాలకే ఫెడరల్ గ్రాంట్లను కేటాయించే అవకాశం లేకుండా చేసే నిబంధనను కూడా సెనేట్ బిల్లులో చేర్చింది. అలాగే ఓ చట్టపరమైన లోపాన్ని ఉపయోగించుకుని సరిహద్దు భద్రతా విభాగానికి అధిక నిధులు కేటాయించే అవకాశం లేకుండా నిబంధనలు రూపొందించింది. డెమొక్రటిక్ సెనేటర్ ప్యాటీ ముర్రే మాట్లాడుతూ.. కొత్త గ్రాంట్ల నిబంధన అమలు కాకుండా అడ్డుకునేందుకు తమ పార్టీ తీవ్రంగా కృషి చేసిందని తెలిపారు.
తాజా బిల్లుకు సెనేట్‌లో సులభంగా ఆమోదం లభించడం గత ఏడాది చోటుచేసుకున్న రికార్డు స్థాయి ప్రభుత్వ షట్‌డౌన్‌తో పోలిస్తే భిన్నమైన పరిణామంగా కనిపిస్తోంది. ఈ ఏడాది వసంతకాలంలో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కూడా కొంతకాలం షట్‌డౌన్‌ను ఎదుర్కొంది. నవంబర్ మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి ప్రభుత్వ షట్‌డౌన్‌కు దారితీయడం రాజకీయంగా ప్రయోజనం కలిగించదని సీనియర్ డెమొక్రటిక్ నేతలు భావిస్తున్నారు. ట్రంప్ ఆర్థిక విధానాలపై ఎన్నికలను ప్రజాభిప్రాయ సేకరణగా మార్చాలని డెమొక్రాట్లు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ఇరాన్ యుద్ధానికి సంబంధించిన సుమారు 70 బిలియన్ డాలర్ల నిధులను ప్రత్యేకంగా ఆమోదించాలని వైట్‌హౌస్ సెనేట్‌పై ఒత్తిడి కొనసాగిస్తోంది. అయితే సెనేట్ రిపబ్లికన్లు సుదీర్ఘ వేసవి విరామానికి వెళ్లే ముందు ఈ నిధులపై ప్రత్యేకంగా ఆమోదం తెలిపే పరిస్థితి కనిపించడం లేదు.