
బ్యూనస్ ఎయిర్స్: ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతోన్న జార్జ్ శనివారం (ఆగస్ట్ 8) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని మెస్సీ టీమ్‌మేట్ నికో పాజ్ కన్ఫామ్ చేశారు. ఈ విషాద వార్త తెలియగానే మెస్సీ ఇంటర్ మయామి మ్యాచ్‌ను రద్దు చేసుకుని.. తన కుటుంబంతో కలిసి ఇంటికి పయనమయ్యారు.
జార్జ్ మెస్సీ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ ప్రముఖులు, మెస్సీ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఫిఫా వరల్డ్ కప్-2026 సమయంలో మెస్సీ తండ్రి ఆసుపత్రిలోనే ఉన్నారు. తమ కుటుంబం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని మెస్సీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిఫా వరల్డ్ కప్-2026లో తొలి గోల్ కొట్టిన సమయంలో మెస్సీ తన తండ్రిని తలచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.
మెస్సీ కెరీర్లో కీ రోల్
మెస్సీ ఫుట్‌బాల్ ప్రయాణంలో అతని తండ్రి జార్జ్‌ది కీలక పాత్ర. చిన్న వయసులోనే కొడుకు ప్రతిభను గుర్తించి స్థానిక క్లబ్‌లో చేర్పించారు. అంతేకాకుండా కోచ్‌గా కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. మెస్సీ ప్రొఫెషనల్ ఫుట్ బాల్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అతడి ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరించారు.
మెస్సీ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ ఖరీదైన చికిత్స కోసం బార్సిలోనా క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకుని 2000వ సంవత్సరంలో కుమారుడిని స్పెయిన్ తీసుకువెళ్లారు. మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజంగా ఎదగడంలో జార్జ్ కీ రోల్ ప్లే చేశారు. బార్సిలోనా, పీఎస్‌జి, ఇంటర్ మయామి క్లబ్‌లతో మెస్సీ అన్ని రకాల వ్యాపార, ఒప్పంద చర్చలను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు.