
NDA: పంజాబ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఇది జరిగిన తర్వాతి రోజే, మహిళా రిజర్వేషన్ బిల్లు, ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని బాదల్ ప్రకటించారు. ఈ పరిణామాలతో బీజేపీ-అకాలీదల్ మధ్య పొత్తు చిగురిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చండీగఢ్‌లో పార్టీ సీనియర్ నేతల సమావేశం తర్వాత బాదల్ మాట్లాడుతూ.. మమహిళలకు చట్టసభల్లో వారి హక్కైన ప్రాతినిధ్యం త్వరగా కల్పించాలని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా గౌరవం, సమానత్వం, హక్కులకు సిక్కు గురువుల బోధనలు ప్రాధాన్యత ఇచ్చాయని బాదల్ అన్నారు. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ ఇప్పటికే సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
ఇదే సమయంలో డీలిమిటేషన్‌కు అకాలీదళ్ మద్దతు ప్రకటించింది. లోక్‌సభ స్థానాలను అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం పెంచాలనే కేంద్ర ప్రతిపాదనకు అకాలీదళ్ మద్దతు ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయాలన్న ప్రతిపాదనను గతంలో వ్యతిరేకించినప్పటికీ, చర్చల అనంతరం సమాన ప్రాతినిధ్యానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు అకాలీ నేత దల్జీత్ సింగ్ చీమా తెలిపారు.
పొత్తుపై చర్చ:
కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన తర్వాత, రైతుల ఉద్యమం వల్ల 25 ఏళ్ల బీజేపీ-అకాలీదల్ పొత్తు ముగిసింది. అయితే, పొత్తులో ఉన్న సమయంలో పలు సందర్భాల్లో పంజాబ్‌లో అధికారాన్ని చేపట్టాయి. పొత్తు విడిపోయిన తర్వాత రెండు పార్టీలు కూడా చతికిల పడ్డాయి. ముఖ్యంగా అకాలీదళ్ రోజురోజుకు తన ప్రభావాన్ని కోల్పోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో రెండు పార్టీల మధ్య మళ్లీ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.