
Volkswagen Virtus Anniversary: జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారత మార్కెట్లో “వర్టస్ యానివర్సరీ ఎడిషన్ (Virtus Anniversary Edition)”ను లాంచ్ చేసింది. వర్టస్ సెడాన్ భారత మార్కెట్లోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చారు. టాప్-స్పెక్ GT ప్లస్ స్పోర్ట్ వేరియంట్ ఆధారంగా రూపొందించిన ఈ యానివర్సరీ ఎడిషన్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్లను జోడించారు. అయితే GT ప్లస్ స్పోర్ట్ వేరియంట్ ధరతో పోలిస్తే ధరను పెంచకపోవడం విశేషం. ఈ స్పెషల్ ఎడిషన్ మొత్తం 150 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
అవోకాడో పెర్ల్ కలర్:
ఈ కారులో ప్రధాన ఆకర్షణ ప్రత్యేకమైన అవొకాడో పెర్ల్ (Avocado Pearl) ఎక్స్‌టీరియర్ కలర్. దీనికి కాంట్రాస్టింగ్ బ్లాక్ రూఫ్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్లు, బ్లాక్ బూట్-లిప్ స్పాయిలర్ ఉన్నాయి. GT ప్లస్ స్పోర్ట్ వేరియంట్‌లో కూడా ఈ డిజైన్ ఎలిమెంట్స్ కనిపించినప్పటికీ.. కొత్త అవొకాడో పెర్ల్ కలర్ కారణంగా యానివర్సరీ ఎడిషన్ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ముందు బంపర్‌పై గ్లోస్-బ్లాక్ ట్రిమ్, డార్క్ హెడ్‌ల్యాంప్, టెయిల్-ల్యాంప్ హౌసింగ్‌లను కూడా అందించారు. క్యాబిన్ పూర్తిగా బ్లాక్ థీమ్‌లో ఉంటుంది. డ్యాష్‌బోర్డ్‌పై గ్లోస్-బ్లాక్ ఇన్‌సర్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
360° కెమెరా, పార్కింగ్ సెన్సార్లు:
ఈ స్పెషల్ ఎడిషన్‌లో కొన్ని అదనపు యాక్సెసరీలను స్టాండర్డ్‌గా అందిస్తోంది. ఇందులో పడ్డిల్ ల్యాంప్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360° కెమెరాలు ఉన్నాయి. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే GT ప్లస్ స్పోర్ట్ వేరియంట్‌లో లభించే ఫీచర్లే ఇందులోనూ కొనసాగుతాయి. లెదరెట్ అప్‌హోల్‌స్టరీ, రెడ్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ సన్‌రూఫ్, 10 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్లు కూడా అందించారు. భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ABSతో పాటు EBD వంటి ఫీచర్లు ఉన్నాయి.
150hp టర్బో పెట్రోల్ ఇంజిన్:
ఈ కొత్త ఎడిషన్లో 1.5 లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్ ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 150hp పవర్, 250Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ను 7 స్పీడ్ DSG డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జత చేశారు. ఈ ఇంజిన్ గేర్‌బాక్స్ కాంబినేషన్‌తో 19.62kmpl వరకు మైలేజీ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. సాధారణ వర్టస్ లో 1.0-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 115hp పవర్, 178Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో ఈ ఇంజిన్ లభిస్తుంది. అయితే ఎడిషన్లో 1.0 లీటర్ ఇంజిన్ ఆప్షన్ లేదు. ఈ స్పెషల్ ఎడిషన్ ధర రూ.19.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.