Reading Time: 2 minutes
Lionel Messi Father Jorge Messi Dies At 68

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మెస్సీ తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూశారు. 68 ఏళ్ల వయసులో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు అర్జెంటీనా, స్పెయిన్‌కు చెందిన పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే మెస్సీ కుటుంబం మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అర్జెంటీనాలోని మెస్సీ స్వస్థలమైన రొసారియోలో జార్జ్ మెస్సీ మృతి చెందినట్లు సమాచారం. మెస్సీ ఫుట్‌బాల్ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో జార్జ్ కీలక పాత్ర పోషించారు. చిన్నతనం నుంచి తన కుమారుడి కెరీర్‌కు అండగా నిలుస్తూ.. అతడిని ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రస్థాయికి తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

సెర్గియా గోర్ తో సతీశన్ భేటీ (2)

మెస్సీ తొలిసారిగా ఆడిన క్లబ్ న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్ జార్జ్ మెస్సీ మృతిపై సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపింది. 68 ఏళ్ల వయసులో రొసారియోలో జార్జ్ కన్నుమూశారని పేర్కొంటూ.. మెస్సీ కుటుంబానికి సానుభూతి తెలిపింది.

లియోనెల్ మెస్సీ కెరీర్‌లో జార్జ్ ఒక బలమైన స్తంభంలా నిలిచారని క్లబ్ పేర్కొంది. విజన్, క్రమశిక్షణ, ఆప్యాయతతో తన కుమారుడి కెరీర్‌కు ఆయన అండగా నిలిచారని తెలిపింది. చిన్ననాటి నుంచి ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యున్నత స్థాయికి చేరుకునే వరకు మెస్సీ ప్రతి అడుగులోనూ జార్జ్ మద్దతు కీలకంగా ఉందని పేర్కొంది. తన కుమారుడికి న్యూవెల్స్ క్లబ్ రంగులను ప్రేమించడం నేర్పినందుకు జార్జ్‌కు ధన్యవాదాలు తెలిపిన క్లబ్.. ఆయన భార్య సెలియా కుచిట్టినీ, కుమారులు లియోనెల్, రోడ్రిగో, మాటియాస్, కుమార్తె మారియా సోల్‌తో పాటు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది.

జార్జ్ మెస్సీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్ సమయంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వెలువడ్డాయి. అర్జెంటీనా జట్టు అల్జీరియాతో ఆడిన తొలి మ్యాచ్‌లో మెస్సీ హ్యాట్రిక్ సాధించిన సమయంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో జార్జ్ ఆరోగ్యం సరిగా లేదనే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత మెస్సీ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. జార్జ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపింది. అయితే తాజాగా ఆయన మృతి చెందినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.