Reading Time: < 1 minute
Mysuru Woman Suicide Workplace Harassment No Weekly Off

Workplace Harassment: ఆఫీసులో వేధింపులకు ఒక మహిళ బలైంది. కర్ణాటక మైసూర్‌కు చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో ఉద్యోగం చేసే చోట ఎదురైన వేధింపులే కారణమని ఆరోపించింది. మృతురాలిని న్యాగేశ్వరిగా గుర్తించారు. ఆమె హినకల్‌లోని రిలయన్స్ మార్ట్‌లో టాటా ప్రోడక్ట్స్ ప్రమోటర్‌గా పనిచేస్తున్నారు. మార్కెటింగ్ సంస్థ పీపీఎంఎస్ ఎజెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరినట్లు సమాచారం.

గత 15 రోజులుగా న్యాగేశ్వరి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఉద్యోగ ప్రదేశంలో తనను వేధిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. తన తప్పు లేకపోయినా సీనియర్లు తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని మృతురాలు సూసైడ్ నోట్‌లో ఆరోపించినట్లు కుటుంబీకులు తెలిపారు. నాలుగు నెలలుగా వారానికి ఒక్క సెలవు కూడా ఇవ్వలేదని, అత్యవసర సెలవు అడిగినా అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించింది.

న్యాగేశ్వరి తన సూసైడ్ నోట్‌లో సూపర్ వైజర్ డాలీ పేరును ప్రస్తావించిందని తల్లి రత్నమ్మ తెలిపారు. పనిస్థలంలో వేధింపులే తన కుమార్తెను బలితీసుకున్నాయని ఆమె ఆరోపించారు. చిన్న చిన్న విషయాలకు కూడా తన కుమార్తెను వేధించేవారని చెప్పారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై పోలీసులు విచారణ ప్రారంభించారు.