
నాగర్ కర్నూల్ జిల్లాలో నకిలీ నోట్ల ముఠా తీగ లాగితే ఏపీలో పూర్తి డొంక కదిలింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మంగనూరు గ్రామానికి చెందిన కురుమూర్తి, నవీన్ గౌడ్ ఈజీ మనీ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. అందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ కరెన్సీ సరఫరా కోసం వెతికారు. ఈ క్రమంలో వచ్చిన ఓ రీల్‌ను చూసి కురుమూర్తి, నవీన్ గౌడ్ సంప్రదింపులు ప్రారంభించారు. ఆ తర్వాత ఏపీలోని భీమవరానికి చెందిన సదరు వ్యక్తులతో పరిచయం పెంచుకుని.. కొంత మొత్తాన్ని తెచ్చుకున్నారు. అసలు డబ్బుకు బదులుగా నాలుగు రెట్లు నకిలీ కరెన్సీ తీసుకునే ఒప్పందం చేసుకున్నారు. రూ.80వేల విలువైన నకిలీ రూ.500 నోట్లు తెప్పించారు. అందులో కొంత భాగాన్ని కురుమూర్తికి ఇచ్చారు. వాటిని గుర్తంచలేరన్న ధీమాతో మంగనూరు గ్రామంలోని దాబా, కిరాణ షాపులు, పెట్రోల్ బంక్, వైన్ షాపులో చలామణి చేశాడు. అయితే వైన్ షాపులో క్యాషియర్ కౌంటింగ్ మెషీన్‌లో పరీక్షించగా నోట్లు నకిలీవని తేలింది. దీంతో వెంటనే బిజినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించడంతో మంగనూరులోని ఓ ఇంటిపై దాడి చేశారు. అక్కడ ఏడు మంది కలిసి ప్రత్యేక పేపర్, కల్ ఫోటోకాపీ మెషీన్, కౌంటింగ్ మెషిన్‌తో నకిలీ రూ.500నోట్లు ముద్రిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.68వేల విలువైన నకిలీ నోట్లు, ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 8మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించగా.. వారిలో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నకిలీ కరెన్సీ తయారీ, రవాణా, చలామణి చేసేందుకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద కరెన్సీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సోషల్ మీడియాలో ఈజీ మనీ పేరుతో వచ్చే అక్రమ ఆఫర్లను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం.. నకిలీ నోట్ల దందాకు దారి తీసి చివరకు కటకటాల పాలయ్యారు.