
Bonda Uma: డీఎస్సీపై ఆంధ్రప్రదేశ్‌లో రాద్ధాంతం నడుస్తోంది.. పాలక, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, డీఎస్సీ పేరుతో వైసీపీ అరాచకానికి పాల్పడుతోందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అరాచకం శృతి మించిందని మండిపడ్డారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ, వైసీపీ నాయకులు చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. బ్రిడ్జ్ గేమ్ కేంద్ర ప్రభుత్వ పాలసీ అని, దానిని పేకాటతో పోల్చుతూ వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే పేపర్ రూపంలో లిఖితపూర్వక వివరణ ఇచ్చిందని తెలిపారు.
డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఎనిమిది నెలలుగా విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పుడు వారిని ఇబ్బందులకు గురిచేసేలా వైసీపీ వ్యవహరిస్తోందని బోండా ఉమా ఆరోపించారు. గత వైసీపీ పాలనలో యువత భవిష్యత్‌తో ఆడుకున్నారని, ఆ సమయంలో జరిగిన అరాచకాలకు అధికారులు కూడా బలయ్యారని విమర్శించారు. మెగా డీఎస్సీ జరగకుండా వైసీపీ 220 కేసులు వేసిందని, అయితే కోర్టు ఆ ఆరోపణలను ప్రాథమిక స్థాయిలోనే తిరస్కరించిందని, మెగా డీఎస్సీ సక్రమంగా జరిగిందని కోర్టు ధృవీకరించిందని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రస్తుతం వైసీపీ గలాటా చేస్తోందని అన్నారు.
ముత్యాలంపాడులో రౌడీషీటర్లను తీసుకొచ్చి గొడవలు చేశారని బోండా ఉమా ఆరోపించారు. వెల్లంపల్లి, అవినాష్, మల్లాది విష్ణు కులం పేరును రాజకీయాల్లోకి తీసుకొచ్చి రచ్చ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బ్రాహ్మణ కులం పేరును రాజకీయాల కోసం ఉపయోగించవద్దని సూచించారు. మల్లాది విష్ణుపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ, ఆయన ఆ కులం పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. వెల్లంపల్లి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, లోకేష్ గురించి తప్పుగా మాట్లాడితే సహించబోనని హెచ్చరించారు.
ఇక, దేవినేని అవినాష్‌పై కూడా బోండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గురించి అవినాష్ మాట్లాడితే తీవ్రంగా స్పందిస్తానని హెచ్చరించారు. అవినాష్, వెల్లంపల్లి కారణంగానే ప్రశాంతంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో గొడవలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. దాడులు టీడీపీ సంస్కృతి కాదని, గతంలో టీడీపీ కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడులు చేసిన వైసీపీ నేతలే ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. మాచర్ల, గుడివాడ ప్రాంతాల్లో తనపై దాడులు జరిగాయని గుర్తుచేశారు. వైసీపీ నేతలు హద్దుల్లో ఉండాలని హెచ్చరించారు. ధర్నా చౌక్ ఉన్నప్పటికీ పోలీసులు ఇతర ప్రాంతాల్లో ధర్నాలకు అనుమతులు ఇవ్వడం సరికాదని బోండా ఉమా అన్నారు. అవసరమైతే ప్రతి నియోజకవర్గంలోనూ ధర్నా చౌక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అభివృద్ధిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎనిమిదో స్థానంలో ఉందని తెలిపారు.
పేర్ని నాని పిచ్చి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దని బోండా ఉమా సూచించారు. బియ్యం కేసు వ్యవహారంలో ఆయన వ్యవహారం బయటపడిందని ఆరోపిస్తూ, టీడీపీలోని ఓ నాయకుడి కాళ్లు పట్టుకుని కేసు నుంచి బయటపడ్డారని, డబ్బులు చెల్లించి కేసు నుంచి బయటపడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే బందరు వెళ్లి బుద్ధి చెబుతానని హెచ్చరించారు. అయితే, వైసీపీ శాంతియుతంగా ఆందోళనలు చేస్తే తనకు అభ్యంతరం లేదని, అయితే హద్దులు దాటితే తమ శైలిలో సమాధానం చెబుతామని అన్నారు. తనకు టీడీపీ టికెట్ లేదని మల్లాది, వెల్లంపల్లి, అవినాష్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపైనా విమర్శలు చేస్తూ ఆయనను తీవ్ర పదజాలంతో విమర్శించారు. తాను ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో అంబటి రాంబాబు వచ్చి తన పక్కన కూర్చున్నారని చెప్పారు. అంబటి గత చరిత్రపైనా ఆరోపణలు చేశారు. చివరగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి అంశంపై తాను మాట్లాడినట్లు బోండా ఉమా తెలిపారు.