
కాళ్లు చేతులు సక్కగా ఉన్న కొందరు కష్టం చేయడానికి ఇష్టపడరు. అలాంటిది అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తి ర్యాపిడో డ్రైవర్ అవతారమెత్తాడు. వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదనే ధైర్యంతో ముందుకు సాగాడు. కానీ ఆ అంగవైక్యలమే అతడికి శాపంగా మారింది. అతడి వైకల్యాన్ని చూసి కస్టమర్లు రైడ్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అతడి బైక్ ఎక్కేందుకు ఇష్టపడటం లేదు.
హైదరాబాద్‌లోని బేగం బజార్‌కు చెందిన దివ్యాంగుడైన రాపిడో రైడర్ సందీప్ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు. హైదరాబాద్‌కు చెందిన సందీప్ దివ్యాంగుడు. కోవిడ్-19 మహమ్మారి మొదలైనప్పటి నుంచి రాపిడో రైడర్‌గా పని చేస్తున్నాడు. అయితే, తన అంగవైక్యలం కారణంగా కొందరు కస్టమర్లు రైడ్ క్యాన్సిల్ చేసుకుంటున్నారంటూ గిగ్ వర్కర్‌గా తాను ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల గురించి వాపోయాడు సందీప్.
‘‘నేను ప్రతిరోజూ వెయ్యి రూపాయలు సంపాదించడానికి ప్రయత్నిస్తా. కానీ నా వైకల్యాన్ని చూసి చాలా మంది కస్టమర్లు రైడ్ రద్దు చేసుకోవడం వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నా. డైలీ 50 నుంచి 60 రైడ్లు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంటా. కానీ కేవలం 10 నుంచి 15 మాత్రమే చేయగలుగుతున్నా. కొన్నిసార్లు ఆ సంఖ్య ఐదుకు కూడా పడిపోతుంది.
ప్రతిరోజూ నలుగురు నుంచి ఐదుగురు కస్టమర్లు నా రైడ్‌ను రద్దు చేసుకుంటారు. నా వైకల్యాన్ని చూసి కొందరు.. నా వాహనం చూసి ఇంకొందరు రైడ్ క్యాన్సిల్ చేసుకుంటారు. మరికొందరు రద్దు రుసుము చెల్లించాల్సి వస్తుందేమోనని రైడ్ క్యాన్సిల్ చేయరు. అలాంటప్పుడు నేను రైడ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తోంది. దీంతో ప్రతి రైడ్ క్యాన్సిల్‌కు నాకు రూ.10 జరిమానా పడుతుంది.
నా వైకల్యాన్ని చూసి రైడ్ క్యాన్సిల్ చేసుకుంటే తానేమి చేయలేను. కానీ నేను కస్టమర్ల భద్రతకు హామీ ఇస్తాను’’ అని సందీప్ ర్యాపిడో రైడర్‌గా తన అనుభవాలను వెల్లడించాడు. తాను ఇతర ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకున్నానని.. అయితే వాటి గురించి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపాడు. ఇబ్బందులు ఉన్నప్పటికీ.. తనను తాను పోషించుకోవడానికి జీవనోపాధి సంపాదించడానికి రాపిడో రైడర్‌గా పని చేస్తున్నానని చెప్పాడు.