
నటి వనిత విజయకుమార్ పేరు అప్పట్లో వార్తల్లో తెగ వినిపించింది. అనేక వివాదాల్లో చిక్కుకొని వైరల్ అయ్యింది. వనిత విజయ్ కుమార్. సొంత కుటుంబ సభ్యులతోనే వివాదం పెట్టుకొని వార్తల్లో నిలిచింది వనిత. కాగా గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు పంచుకున్నారు. “నాన్నే నా హీరో” అనే భావన సర్వసాధారణం కాగా, తన విషయంలో ఇది భిన్నంగా మొదలై, చివరకు తన తండ్రి సవాళ్లే తనను బలపరిచాయని వనిత చెప్పుకొచ్చారు. తన తండ్రి “విలన్” కాదని, అయితే జరిగిన సంఘటనలను బట్టి చూస్తే, ఆనాటి పరిస్థితి తన జీవితాన్ని తలకిందులు చేసిందని తెలిపారు. ఆస్తి వివాదాల కారణంగా తన తండ్రి పోలీస్ లను ఉపయోగించి తనను అర్ధరాత్రి తన సొంత ఇంటి నుంచి నడిరోడ్డుపైకి గెంటేసిన తీరును వనిత వివరించారు.
దుస్తులు, వస్తువులు లేకుండా, స్నేహితులు తప్ప ఎవరూ లేని నిస్సహాయ స్థితిలో తాను రోడ్డున పడ్డానని, పోలీసులు తనను కొట్టారని ఆమె అన్నారు. ఆ సమయంలో ఏ పోలీస్ స్టేషన్ లో కూడా తన ఫిర్యాదును తీసుకోలేదని, అది బిగ్ బాస్ కు ముందు నాటి సంఘటన అని, డబ్బుతో ఆ రోజుల్లో ఇలాంటివి చేయగలిగేవారని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వనిత చెన్నైని, రాష్ట్రాన్ని విడిచి వెళ్లి, కర్ణాటకలోని మైసూర్ లో దాదాపు మూడేళ్లపాటు తన పిల్లలతో కలిసి జీవించారు. అలాగే కుటుంబం నుంచి బెదిరింపులు, నోటీసులు వంటి అనేక సమస్యలు ఎదుర్కొన్నానని, శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపారు.
మైసూర్ లో ఉన్నప్పుడు ఒకరోజు తన తండ్రికి ఫోన్ చేసి, “నాన్నా, ఇదేంటి..? ఎందుకు ఇలా జరుగుతోంది? అమ్మ ఉంటే ఇలా జరిగేదా?” అని ఏడుస్తూ అడగగా, “నువ్వు తమిళనాడులో కాలు పెట్టలేవు, వచ్చి చూడు” అని సవాలు విసిరారని వనిత వెల్లడించారు. ఆ సవాలే తన జీవితాన్ని మలుపు తిప్పిందని, నేడు తమిళనాడు ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు తనను తమ సొంత కుటుంబ సభ్యురాలిగా, అక్కగా చూస్తున్నారని వనిత ఆనందంగా తెలిపారు. తన తండ్రి, కుటుంబం లేకుండా తాను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని, ప్రస్తుతం తెలుగు ప్రజల ఆదరణ కూడా లభిస్తోందని పేర్కొన్నారు. తన తండ్రి విసిరిన ఆ సవాలే తనను ఇంత దూరం తీసుకొచ్చిందని, అందుకే తన తండ్రి కూడా తన హీరోనేనని వనిత అన్నారు. అయితే, ఇంత విజయం సాధించిన తర్వాత తండ్రితో మాట్లాడటానికి ప్రయత్నించగా, ఆయన “ఒంట్లో బాలేదు” అని చెప్పి, పరిస్థితిని దాటవేయడానికి ప్రయత్నించారని వనిత తెలిపారు. తన అన్నయ్య అరుణ్ తో మాత్రం బయట కలిసి మాట్లాడతానని, వారి మధ్య మంచి బంధం ఉందని చెప్పారు. తన సోదరీమణుల పట్ల ఇప్పటికీ తనకు ప్రేమ, గౌరవం ఉన్నాయని, అయితే ప్రేమను బలవంతంగా పొందలేమని, అది వారి నుంచి స్వచ్ఛందంగా రావాలని వనిత చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.