Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: సోమనాథ్ స్వాభిమాన్ పర్వదినం గురువారం ప్రారంభమైందని, ధర్మ సిద్ధాంతాలు, నైతికతపై రాజీపడని అశేష భరత మాత బిడ్డలను ఇది గుర్తు చేస్తోందని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. గుజరాత్ లోని వెరవల్ వద్ద సోమనాథ్ దేవాలయం పునరుద్ధరణ కావడంతో భారత నాగరికత పునరుద్ధరణకు గుర్తుగా ఏడాది పొడుగునా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. విదేశీయులు అనేకసార్లు ఈ ఆలయంపై గతంలో దాడులు చేశారు. “ జై సోమనాథ్ స్వాభిమాన్ పర్వదినం ఈరోజు ప్రారంభమైంది. వేల సంవత్సరాల క్రితం 1026 జనవరిలో మొట్టమొదటిసారి సోమనాథ్ ఆలయం విదేశీయుల దాడికి గురైంది. ఆ తరువాత అనేక సార్లు దాడులు జరిగినా కొన్ని కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని, నాగరికతా స్ఫూర్తిని కానీ తగ్గించడం లేదా నాశనం చేయలేకపోయాయి. సోమనాథ్ దేవాలయం మళ్లీమళ్లీ తిరిగి నిర్మాణమైంది” అని మోడీ తన పోస్టు ద్వారా వెల్లడించారు.

ఈ ఆలయం వద్ద జనవరి 11న సోమనాథ్ పర్వ దిన కార్యక్రమానికి ప్రధాని మోడీ పాల్గొంటున్నారు. సోమనాథ్ ఆలయాన్ని గతంలో తాను సందర్శించినప్పటి కొన్ని ఫోటోలను మోడీ ప్రసారం చేశారు. 1951లో అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో సోమనాథ్ పునర్నిర్మాణ ఆలయం తలుపులు తెరిచిన సంఘటన జరిగి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా 2001 అక్టోబర్ 31న జరిగిన కార్యక్రమం తాలూకు ఫోటోను మోడీ ప్రసారం చేశారు. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణలో సర్దార్ పటేల్, కెఎం మున్షీ, ఇంకా అనేక మంది కృషి చెప్పుకోతగినదని మోడీ ప్రశంసించారు. 2001 నాటి కార్యక్రమంలో అప్పటి ప్రధాని వాజ్‌పాయ్, హోం మంత్రి అద్వానీ, తదితర ప్రముఖులు హాజరయ్యారు.